పొగలేని బస్సులు

5

– ఎంపీల కోసం ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి):కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎంపీల కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసును దిల్లీలో సోమవారం ప్రధాని చేతులవిూదుగా ప్రారంభించారు. సూర్యరశ్మితో పనిచేసే ఈ బస్సును పార్లమెంటు వద్ద ఎంపీలకు సేవలందించడం కోసం రవాణా శాఖ మంత్రి గడ్కరీ పార్లమెంటు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కి బహూకరించారు. అనంతరం దాన్ని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎప్పటి నుంచో అంతా మాట్లాడుకుంటున్నామన్నారు. అయితే కొన్నేళ్లుగా కాలుష్యం ప్రభావం సామాన్యులపై నేరుగా పడటం ప్రారంభమైందని ప్రధాని చెప్పారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉందని అయితే అది ప్రస్తుతం సవాలుగా మారిందన్నారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఇటీవల జరిగిన వాతావరణ సదస్సులో భాగంగా పుష్కలంగా ఉన్న సౌర శక్తిని ప్రపంచ దేశాలు ఇంధనంగా మార్చుకునే విషయాన్ని తాను ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ రంగంలో కొత్త ఆవిష్కరణల కోసం భారత్‌, అమెరికా, ఫ్రాన్స్‌లు చేతులు కలిపాయని చెప్పారు. గ్రీన్‌ టెక్నాలజీస్‌ కోసం త్వరలోనే ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలియాన్స్‌ ఏర్పాటుకాబోతోందని చెప్పారు. దాని ముఖ్య కార్యాలయం దిల్లీలోనే ఉండవచ్చునని చెప్పారు.  ఇదిలావుంటే దేశ రాజధాని దిల్లీలో నవంబర్‌, డిసెంబర్‌ నెలలోని తొలి పది రోజుల్లో వాయు కాలుష్యం మరింత పెరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. గాలిలో పర్టిక్యులర్‌ మ్యాటర్‌(పీఎం) స్థాయిలు పెరగడంతో దాని నాణ్యత మరింత దెబ్బతిని ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పారు. రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు గాను ఆయన సోమవారం ఈ మేరకు సమాధానమిచ్చారు. వాయు కాలుష్యం.. వాతావరణంలోని వేడి, గాలి దిశ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో… రోడ్లపై తిరిగే వాహనాలు, మున్సిపాలిటీ చెత్త తగలబెట్టడం, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం తదితరాలపై కఠిన నిబంధనలు అమలు చేయడం అనివార్యమైందని చెప్పారు.