పోచమ్మ తల్లికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 23 (జనం సాక్షి)

అండర్ రైల్వే గేట్ శంభునిపేట ప్రాంతంలోని కాకతీయుల కాలం నాటి చారిత్రక శ్రీ పోచమ్మ తల్లికి ఆనవాయితీ ప్రకారం స్థానిక కుమ్మరులు (శాలివాహనులు) తమ ఆచారం ప్రకారం పోచమ్మకు తొలి బోనం (నైవేద్యాన్ని) సమర్పించారు. శ్రావణమాసం నిర్వహించే పోచమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కుమ్మరులు ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి ఏటా ఆనవాయితీ ప్రకారం కుమ్మరులు తయారు చేసిన మట్టి పాత్రలో తొలిబోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారని ఆలయ పూజారి కందికొండ మోహన్ తెలిపారు. భూమి, నీరు, ఆకాశం, గాలి, నిప్పు, ఈ పంచ భూతాల మధ్య రూపుదిద్దుకున్న మట్టి పాత్రలో బోనం సమర్పించటం అమ్మవారికి ప్రీతికరమని అందుకే ప్రజలు మట్టి పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించాలని కందికొండ మోహన్ కోరారు. తమ గ్రామ ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుతూ గ్రామంలో కుమ్మరులు సేకరించిన జోగు బియ్యం, పసుపు, కుంకుమ పూజా ద్రవ్యాలతో కుమ్మరులు తమ ఇంట్లోని పూజ ద్రవ్యాలను జోడించి పోచమ్మ తల్లికి తమ ఆనవాయితీ ప్రకారం తొలి బోనం సమర్పించి యాట పోతులు బలి ఇస్తారని, అనంతరం గ్రామ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని ఈ సందర్భంగా కందికొండ మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కందికొండ మల్లయ్య, చక్రపాణి, జనార్ధన్, మురళీకృష్ణ, సముద్రాల రాజు, ప్రకాష్, కందికొండ ముఖేష్, వీరమ్మ, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.