పోడుపట్టాల్లో పాడుపనులు చేయొద్దు
` ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త` మంత్రి కేటీఆర్ హెచ్చరిక
రాజన్నసిరిసిల్లబ్యూరో,నవంబరు 6(జనంసాక్షి): పోడు భూముల పేరుతో డబ్బు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. శనివారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన పోడు భూముల అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామన్నారు. హరిత హారంలో మూడేళ్లలో 4.5శాతం పచ్చదనం పెరిగిందన్న మంత్రి.. అటవీ ఆక్రమణలు జరగకూడదనే హక్కు పత్రాలు అందిస్తామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అవసరమైతే వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. అధికారులు తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడుతాయ్..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అటవీ భూములపై అధికారులు కోర్టుల్లోనూ పోరాడాలని.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు.