పోడురైతులకు న్యాయం చేయాలి

బంగారు తెలంగాణ అంటే ఇదేనా?

ఖమ్మం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పోడుదారులపై కేసులు పెట్టి… పంటలు నాశనం చేయడంతో… బంగారు తెలంగాణ వచ్చినట్లా? అని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. పోడుదారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుండడం దారుణమన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే వామపక్ష పార్టీల నాయకులమంతా కలిసి పోరాడుతున్నారని అన్నారు. పోడు భూముల విషయంలో ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. పోడు సాగుదారులపై కేసులు పెట్టి పంటలు ధ్వంసం చేయడం దారుణమన్నారు. మరో నెలరోజుల్లో చేతికందే పంటను అటవీశాఖాధికారులు ధ్వంసం చేసిన తీరుపైఆయన మండిపడ్డారు. పోడుసాగుదారులపై ప్రభుత్వం చేస్తున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో కమ్యూనిస్టులకు తెలుసు అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పేదొకటి ఇక్కడ చేసేది మరోటి అని విమర్శించారు. పోడుదారులపై ప్రభుత్వం చేస్తున్న దమనకాండ గురించి మానవ హక్కుల సంఘానికి తెలియజేస్తామన్నారు. ఎన్ని కేసులు పెట్టిన తాము సిద్ధమేననీ, జైలుకైనా వెళ్తామనీ, పోడుభూములను మాత్రం వీడే ప్రసక్తే లేదన్నారు. అధికారం రాకముందు ఇచ్చిన వాగ్దానాలను తెరాస ప్రభుత్వం అధికారం వచ్చాక విస్మరించిందన్నారు. పంటలు పాడు చేస్తున్న ప్రభుత్వానికి గోరి కడతామని హెచ్చరించారు.