పోడు భూములకు శాశ్వత పరిష్కారం

 రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
 వికారాబాద్  జిల్లా బ్యూరో జనం సాక్షి సెప్టెంబర్ 22
జిల్లాలో అటవీ సంపదను సంరక్షించుకోవడంతోపాటు  ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం సత్వర చర్యలు  తీసుకోవాలని  విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య
 కు సంబంధించి   21,761  ఎకరాలకు 9647  అర్జీలు వచ్చాయని, వాటిని  క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని మంత్రి తెలిపారు. 101 గ్రామపంచాయతీలు, 128 హాబిటేషన్లలో షెడ్యూలు తెగలకు సంబంధించిన వారు 10, 635 ఎకరాలలో  అదేవిధంగా 11126 ఎకరాలలో ఇతరులు పోడు భూములు సాగు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని మంత్రి తెలిపారు.అటవీ సంపదను కాపాడుకోవడం తో పాటు, భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే నియమించబడిన ఫారెస్ట్ రైట్ కమిటీలు
అర్హుల జాబితాను సిద్ధం చేసిన పిదప గ్రామ పంచాయతీ తీర్మానంతో సబ్ డివిజనల్ కమిటీ ద్వారా జిల్లా స్థాయి కమిటీ కు  పంపాల్సి ఉంటుందనీ మంత్రి తెలిపారు.  అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి హక్కు కల్పించేందుకు   ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కార నిమిత్తం శాసనసభ్యుల సహకారం తీసుకొని వాస్తవంగా పోడు భూములు చేసుకున్న వారికి అన్యాయం జరగకుండా చూడాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు  పోడు  భూములలో వ్యవసాయం చేసుకుంటున్న వారికి న్యాయం చేస్తూనే ఇక మీదట అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అరికట్టేందుకు అటవీ రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను  సమావేశపరిచి భవిష్యత్తులో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
       జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఇప్పటికే  భూముల సమస్యల పరిష్కారం నిమిత్తం గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ వచ్చిన అర్జీలన్ని పరిశీలించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో  అర్హులైన వారికి పోడు భూములకు సంబంధించిన పట్టాల అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  పోడు భూములలో సాగులో ఉన్న గిరిజనులతో పాటు ఇతర కులాల వారిని కూడా గుర్తించి అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
      ఈ సమావేశంలో జెడ్పి చైర్ పర్సన్ పి.సునీత మహేందర్ రెడ్డి, వికారాబాద్, పరిగి,  చేవెళ్ల శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్,  కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా పరిషత్ వాయిస్ చైర్మన్ విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి తో పాటు అటవీ శాఖ అధికారులు,  తాసిల్దారులు,  ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు,  ఎంపివోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు