పోనేపోను.. శ్రీనివాసన్‌ బెట్టు

దిగిపోవాల్సిందే.. : శుక్లా
న్యూఢల్లీి, మే 29 (జనంసాక్షి) :
ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను వదలడం లేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో, శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేయడంతో శ్రీనివాసన్‌ తప్పుకోవాలనే డిమాండ్‌ ఊపందుకుంది. సొంత కుటుంబానికి చెందిన వ్యక్తి, జట్టు సీఈవో స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకుంటే శ్రీనివాసన్‌ ఎలా పదవిలో కొనసాగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విచారణ నిష్పాక్షింగా జరిగేందుకు పదవి నుంచి తప్పుకొని తీరాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డులో శ్రీనివాసన్‌ ఆధిపత్యం ముగింపు దశకు చేరుకుంది. బోర్డ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి అతను వైదొలగక తప్పేలా కనిపించడం లేదు. బోర్డులో తనను ఎవ్వరూ రాజీనామా చేయమనలేదని కొన్ని రోజులుగా చెబుతోన్న శ్రీనివాసన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బీసీపీఐ వైస్‌ ప్రెసిడెంట్‌, ఐపీఎల్‌ ఛైర్మన్‌గా ఉన్న రాజీవ్‌శుక్లా తొలిసారిగా శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. మరో వైస్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌జైట్లీతో ప్రత్యేకంగా సమావేశమైన శుక్లా శ్రీనివాసన్‌ రాజీనామా చేస్తే మంచిదని సూచించారు. బోర్డు గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, విచారణ పూర్తయ్యే వరకూ పదవి నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. జైట్లీ కూడా ఇదే మాటను శ్రీనివాసన్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. వీరిద్దరి ప్రకటన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బోర్డులో సీనియర్ల నుంచి తొలిసారిగా వ్యతిరేకత రావడంతో షాక్‌ తిన్న శ్రీనివాసన్‌ వెంటనే ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి చేరుకుని వారితో చర్చించారు. తాను తప్పుకునే పరిస్థితి లేదని వారికి తేల్చి చెప్పారు. ఒకదశలో జైట్లీతో కాస్త అసహనంతోనే మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు శ్రీనివాసన్‌ను పదవి నుంచి తప్పించేందుకు తమ దగ్గర పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో శుక్లా కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే తనపై ఎటువంటి ఆరోపణలు లేనప్పుడు ఎందుకు రాజీనామా చేయాలని శ్రీనివాసన్‌ ప్రశ్నించారు. గతంలో కూడా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చినప్పుడు బీసీసీఐ చీఫ్‌లు ఎవరూ తప్పుకోలేదని గుర్తు చేశారు. ఫిక్సింగ్‌ విచారణలో తాను జోక్యం చేసుకోనని, దోషిగా తేలితే చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీ పైనా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అటు కేంద్ర క్రీడాశాఖ కూడా శ్రీనివాసన్‌ రాజీనామా చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. నైతిక విలువలను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసన్‌ తప్పుకోవాలని క్రీడామంత్రి జితేందర్‌సింగ్‌ సూచించారు.