పోరాటాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి

పోరాటాలు, ప్రజా ఉద్యమాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కుతగ్గడం. రాష్ట్ర చరిత్రనే మార్చిన ఘనత విద్యుత్‌ ఉద్యమాలకు ఉంది. 2020 వరకు నేనే సీఎంగా ఉంటానని స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మిస్తానని గొప్పలు చెప్పుకొని, అధికార గర్వంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన చంద్రబాబు సర్కారును కూకటివేళ్లతో పెగిలించి వేసింది విద్యుత్‌ ఉద్యమం. హైటెక్కు షోకులతో గొప్పలు పోతున్న బాబు అప్పట్లో ఆకాశంలో విహరించాడు. రాష్ట్రమంతా హైదరాబాద్‌లాగే అభివృద్ధి పథంలో ఉందనుకున్నాడు. బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లిలో వెలిసిన భవంతులే రాష్ట్రం మొత్తం విస్తరించి ఉన్నాయనుకున్నాడు. వరుస కరువు, విపరీతంగా పెరిగిన ధరలతో తల్లడిల్లుతున్న ప్రజలను పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్లుగా చార్జీలు పెంచుకుంటూ పోయాడు. 2000 సంవత్సరంలో ఇలాగే చార్జీలు పెంచి దానిని నిరసించిన ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపాడు. ఎన్ని ఆందోళనలు చేసినా సర్కారు దిగిరాకపోవడంతో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్షాలు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల విద్యుత్‌ సౌధ ముట్టడికి పిలుపునిచ్చాయి. 2000 ఆగస్టు 28న ఒక్కరొక్కరుగా ఉద్యమకారులు బయలుదేరి పెద్ద దండులాగా మారారు. పోలీసులను ఎదుర్కొని తుపాకీకి ఎదురుగా గుండెనిలిపి ఉద్యమాన్ని హోరెత్తించారు. సహనం కోల్పోయిన పోలీసులు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే జరిపిన కాల్పుల్లో ఉద్యమకారులు నేలకొరిగారు. బషీర్‌రోడ్డు మృతుకేంద్రంగా మారింది. నల్లటితారురోడ్డుపై నెత్తిటి చారికలు అట్టుకట్టాయి. టీడీపీ ఈ మారణకాండతో 2004 ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రజలంతా ఏకమై ఫాసిస్టు పాలకవర్గానికి చరమగీతం పాడారు. వామపక్షాల నేతృత్వంలో సాగిన ప్రజా ఉద్యమాలను కాంగ్రెస్‌ పార్టీ సొమ్ము చేసుకుంది. 2004 ఎన్నికల్లో వచ్చే ఐదేళ్లలో విద్యుత్‌ చార్జీలు పెంచబోమనే హామీతో కాంగ్రెస్‌ గట్టెక్కింది. అన్నట్టుగానే మొదటి ఐదేళ్లలో ప్రభుత్వం గృహ విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి భారాన్ని మోపలేదు. 2009 ఎన్నికల సమయంలోనూ విద్యుత్‌ చార్జీల అంశంగా కీలకంగా మారింది. మరో ఐదేళ్లు కూడా గృహ వినియోగదారులపై ఎలాంటి భారం మోపబోమని ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్‌ ఆ హామీని విస్మరించి యథేచ్ఛగా చార్జీలు పెంచుతూ పోయింది. రాష్ట్రంలో సరైన విద్యుత్‌ విధానం పాటించని పాలకులు ఎప్పుడు ఎంత విద్యుత్‌ అవసరమవుతుందో కూడా సరైన అంచనా వేయకుండానే యేటా ముందుకు సాగుతున్నారు. దానికి ప్రతిఫలమే ప్రజలపై ఏడాదికి నాలుగు మార్లు సర్‌ చార్జీల భారం. ప్రజలకు ఎంత కరెంట్‌ అవసరమో ముందస్తుగా గుర్తించకుండా, ఎంత విద్యుత్‌ మన దగ్గర ఉత్పత్తి అవుతుంది.. ఇంకెంత కొనుగోలు చేయాలో లెక్కించకుండానే పాలకులు ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వరంగంలోని విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని కావాలనే జాప్యం చేస్తూ తమ ప్రాంతానికే చెందిన పెట్టుబడిదారి శక్తులు ల్యాంకో, జీఎంఆర్‌ నుంచి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం, ఆ చార్జీ కూడా తమకు సరిపడదని గగ్గోలు పెట్టాయి. దీంతో కరిగిపోయిన సర్కారు పెద్దలు ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా సర్‌చార్జీల భారాన్ని మోపి ఆ మొత్తాన్ని ల్యాంకో, జీఎంఆర్‌ చేతుల్లో పోశారు. ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను వారికి అప్పనంగా ఇస్తేనే ఉత్పత్తి అయిన విద్యుత్‌కు అదనపు ఉత్పత్తి చార్జీలు చెల్లించడం, అదీ వాడుకున్న తర్వాత కొన్నాళ్లు చెల్లించాలని సర్కారు హుకుం జారీ చేయడం మన పాలకుల దివాళకోరు విధానాలకు తార్కాణం. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్సీ) సూచనలు చేసిందే తడవుగా రాష్ట్ర సర్కారు ఇష్టారాజ్యంగా విద్యుత్‌ చార్జీలు పెంచుకుంటూ పోయింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఈఆర్సీ చేసిన సిఫార్సులు యథాతదంగా అమలు చేయాలని సర్కారు సంకల్పించింది. ఇంతకాలం ఎంతగా చార్జీలు పెంచినా ఎదురుగాని ప్రతిఘటన ఈసారి స్వపక్షం నుంచి ముఖ్యమంత్రి ఎదుర్కొన్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి సర్కారు నిర్ణయాన్ని ఎండగట్టాయి. ప్రతిపక్షాలు ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని సాగించాయి. దీక్షలు, ఆందోళనలు మిన్నంటాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి కిరణ్‌ భూమార్గం పట్టాడు. చంద్రబాబులా పంతాలకు పోకుండా చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే గృహ వినియోగదారులపై పెంపుభారం విధించకపోగా కాస్త చార్జీలను తగ్గించారు. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక అడుగుముందుకేసి 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తానంటూ ప్రకటించాడు. ఇందుకు కారణం ఏడాదిలోపే ముంచుకొస్తున్న ఎన్నికలు. ఈ తరుణంలో చార్జీల పెంపు నిర్ణయంపై అధిష్టానం అక్షింతలు. ప్రజా ఉద్యమాల ప్రభావం ఎంతలా ఉంటుందో ఇప్పుడు అన్ని పక్షాలు గుర్తిస్తే మంచింది. 2009లో తారస్థాయిలో వచ్చిన తెలంగాణ ఉద్యమం కేంద్రాన్ని దిగివచ్చేలా చేసింది. ఇప్పుడు ఉద్యమపార్టీలుగా చెప్పుకునేవి కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. ఉద్యమిస్తేనే ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి.