పోరాటాలు మాకు కొత్తకాదు: మల్లేశ్‌

ఆదిలాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): పోరాటాలు సీపీఐకి కొత్తేవిూ కాదని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పోరుబాటను నిర్వహిస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులు రావడం లేదు.. బీసీల వెనుకబాటుతనం అలాగే ఉందని తెలిపారు. విద్య, వైద్యంతో పాటు జీవించే హక్కును హరించే పరిస్థితులు తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్నాయని అన్నారు. శనివారంనాడిక్కడాయన మాట్లాడుతూప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచుల్లో అన్నారు. కలుషిత రాజకీయాలను ప్రక్షాళన చేయడమే సీపీఐ పోరుబాట లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టులను అవమానపరిచేలా సిఎంకెసిఆర్‌ చరిత్రను వక్రీకరించేలా నిజాం నవాబును పొగడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో సాధించుకున్నవేనని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని, ఎప్పుడూ లేని విధంగా పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని అన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకుడు ఆరోపించారు. ఉప్పులు, పప్పులు, నూనె, కూరగాయల ధరలు మండిపోతున్నాయని, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదని ధ్వజమెత్తారు. అధిక ధరలను నిరసిస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, ఎఫ్‌డీఐలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ధరలను నియంత్రిస్తామని గ్దదెనెక్కిన ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన ధరలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్లుగా లక్ష ఉద్యోగాల ప్రకటనపైనా స్పష్టత ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖలు, జూనియర్‌, డిగ్రీ, ఏయిడెడ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వేలాది ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందించాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు.