పోరాడి ఓడిన జింబాబ్వే:దక్షిణాఫ్రికా శుభారంభం

హమిల్టన్: వన్డే ప్రపంచకప్ లోభాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే పోరాడి ఓడింది. 340 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఆదిలో దూకుడుగా ఆడినా చివర్లో బోల్తాపడి ఓటమిని చవిచూసింది. ఆదిలో సఫారీలను వణికించిన జింబాబ్వే 62 పరుగుల తేడాతో  ఓటమి చెందింది.  ఓ దశలో జింబాబ్వే విజయం సాధించే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే దక్షిణాఫ్రికా పటిష్ట బౌలింగ్ ముందు అండర్ డాగ్ జింబాబ్వే తలవంచక తప్పలేదు.
జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(64), మసకజ్జా (80), టేలర్(40) పరుగులు చేసి కాసేపు సఫారీలకు దడ పుట్టించారు.  కాగా చివరి వరసు ఆటగాళ్ల పూర్తిగా వైఫల్యం చెందడంతో జింబాబ్వే 48.2 ఓవర్లలో 277 పరుగులకే పరిమితమై ఓటమి చెందింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 339 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.