పోలవరం ఎపి ప్రజల జీవనాడి
అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం: చంద్రబాబు
ఏలూరు,జూన్11(జనం సాక్షి): పోలవరం ఎపి ప్రజల జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. పనులు త్వరత్వరగా పూర్తి చేస్తున్న పోలవరం ఇంజనీర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తనకు సోమవారం పోలవారమేనని అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయాఫ్రమ్ వాల్ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డయాఫ్రమ్ వాల్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం సిఎం విూడియాతో మాట్లాడుతూ.. 63 వారాలు వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశానని.. ఇంత కష్టపడుతుంటే… వైసిపి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందనిచంద్రబాబు మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేయడం తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎక్కువ భాగం భూమిలోనే ఉంటుందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు డయాఫ్రమ్ వాల్ కీలకమని అన్నారు. ఒక్క రోజులో 60 వేల బస్తాల సిమెంట్ వాడారన్నారు. నవయుగ కంపెనీ ప్రాజెక్టు నిర్మాణంలో రికార్డులను అధిగమిస్తోందని సిఎం కొనియాడారు. నవయుగ కంపెనీ పాత రేట్లకే పనులు చేసేందుకు ముందుకు వస్తే.. వైసీపీ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికులు, ఇంజినీర్లు, గుత్తేదారులను అభినందించారు. అనంతరం స్పిల్ ఛానల్ వద్ద 13 జిల్లాల రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పోలవరం నిర్మాణంలో డయాఫ్రంవాల్ పూర్తిచేయడం ఓ చరిత్ర. పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. దేశంలో రెండు నదులను అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. త్వరలోనే వంశధార, నాగావళి, పెన్నా, గోదావరి నదులను అనుసంధానం చేస్తాం. నదుల అనుసంధానంతో నీటి కరువును పారదోలాలి. వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకోవాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఎంపి మాగంటి బాబు, సీతామాలక్ష్మి ,స్థానిక నేతలు పాల్గొన్నారు.