పోలవరం ముప్పు తేల్చండి

` హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
` ప్రాజెక్టువల్ల రాష్ట్రంపై ఏర్పడే ప్రభావంపై స్పష్టత రావాలన్న తెలంగాణ అధికారులు
` బ్యాక్‌వాటర్‌ లెవెల్స్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని వినతి
హైదరాబాద్‌(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాద్‌లో భేటీ అయింది. ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్‌ అతుల్‌ జైన్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్‌, ఏపీకి చెందిన ఇద్దరు చీఫ్‌ ఇంజినీర్లు భేటీలో పాల్గొన్నారు.పోలవరం పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు, ఇతర అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తించే అంశం, పోలవరం బ్యాక్‌ వాటర్స్‌ ప్రభావం ఉండే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను తెలంగాణ అధికారులు మరోమారు ఈ భేటీలో లేవనెత్తారు. పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యం గురించి సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. కిన్నెరసాని, ముర్రేడువాగు, ఇతర ప్రవాహాల చర్యల గురించి ప్రస్తావించారు. ఖమ్మం పట్టణం, భద్రాచలం పట్టణాలపై పోలవరం బ్యాక్‌ వాటర్స్‌ ప్రభావం, రామాలయం వద్ద నీటిమట్టం, మణుగూరు భారజల ప్లాంట్‌ వద్ద వాటర్‌ లెవెల్స్‌ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులు మరోసారి అథారిటీని కోరారు. గత ఏడాది వరదల ప్రభావంతో ముంపునకు గురైన నేపథ్యంలో అధ్యయనం సమగ్రంగా జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఆ ప్రభావం తెలంగాణపై ఏ మేరకు ఉంటుందనే విషయాలపై స్పష్టత రావాలని అథారిటీని తెలంగాణ అధికారులు కోరారు.

 

తాజావార్తలు