పోలవరం విషయంలో.. జగన్‌ చిత్రవిచిత్రాలు చేస్తున్నాడు


– ఇంజనీర్లు, శాఖా మంత్రి లేకుండా కాంట్రాక్టర్లతో చర్చలా!
– రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సమాలోచనలు చేశారా?
– కేసీఆర్‌ వ్యాఖ్యలపై జగన్‌ నోరువిప్పాలి
– టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా
గుంటూరు, సెప్టెంబర్‌24 జనం సాక్షి  : పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్‌ చిత్ర విచిత్రాలు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలుపై జగన్‌ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. సింగిల్‌ టెండర్‌ ద్వారా ఏఏ వెసులు బాటు ఇచ్చారో జగన్‌ బయటపెట్టాలన్నారు. దీనిపై విద్యుత్‌ శాఖ, ఏపీ జెన్‌కో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రివర్స్‌ టెండరింగ్‌ వల్ల 28నెలలు పోలవరం పనులు ఆలస్యం కానున్నాయని ఉమా విమర్శించారు. 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ చెప్పినప్పటికీ, జగన్‌
మాత్రం 2021 నాటికి పూర్తి చేయాలని చెప్పారని, అందులో మతలబేంటని ప్రశ్నించారు. 2017 సెప్టెంబర్‌లో నవయుగ రూ.3,200 కోట్లకు పవర్‌ ప్రాజెక్టు కడతామని చెప్పిందని, అప్పుడు మెగా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.3,455 కోట్లకు కడతామని పేర్కొందన్నారు. ఇప్పుడు అదే సంస్థ రూ.2,810కోట్లకు కోట్‌ చేసిందని దేవినేని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారని, అందుకు జగన్‌ ఒప్పుకున్నారని ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించబోమని సీఎం ఎందుకు చెప్పట్లేదని విమర్శించారు. ఇద్దరు సీఎంల చర్చల్లో జలవనరుల మంత్రి లేకుండా గోదావరి జలాలపై వారు చర్చలు జరిపారని, అధికారులు, ఇంజినీర్లు ఎవ్వరూ లేకుండా కాంట్రాక్టర్లతో కూర్చుని నాలుగు గంటల పాటు చర్చలు జరిపారని విమర్శించారు. రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సమాలోచనలు జరుపుతున్నారన్నారు. జాతీయస్థాయిలో జలవనరుల శాఖకు అనేక అవార్డులు వస్తే ముఖ్యమంత్రి, మంత్రి చెప్పుకోలేక పోతున్నారని, దాదాపు 35అవార్డులు జలవనరుల శాఖకు గత ప్రభుత్వ పనితీరు వల్ల దక్కాయని దేవినేని ఉమా పేర్కొన్నారు. కేసీఆర్‌తో చేతులు కలిపి జగన్‌ రాష్టాన్రికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ చెప్పుచేతల్లో ఏపీని పెట్టారని, అక్కడ ఆయన ఆడిస్తుంటే ఇక్కడ ఆయన ఆడుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న ప్రజలు, కేవలం జగన్‌ కక్షపూరిత రాజకీయాలతో ఇప్పడవి తొలగించారని అన్నారు. వెంటనే గత ప్రభుత్వ పథకాలను కొనసాగించాలని ఉమ డిమాండ్‌ చేశారు. ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని, జగన్‌ తన అహంకారాన్ని తగ్గించుకోకపోతే గుణపాఠం తప్పదని మాజీ మంత్రి హెచ్చరించారు.