పోలింగుకు సర్వం సిద్దం: డిపీఓ

సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్దం చేశామని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగుకు వినియోగించే అన్ని రకాల సామగ్రి పంపిణీకి ఒకటికి రెండు సార్లు పర్యవేక్షించి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అంతరాయాలు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. మూడో విడత కింద హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఐదు మండలాల్లోని 122 పంచాయతీలు, 1066 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, మద్దూరు మండలాల్లోని 122 ప్రాంతాల్లో 1066 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు పోలీసు శాఖ సమస్యాత్మక ప్రాంతాలు-8, సాధారణ ప్రాంతాలు-114 గుర్తించింది. డివిజన్‌ పరిధిలో విూర్జాపూర్‌, శనిగరం, చెంచల్‌చెరువుపల్లి, గండిపల్లి, గోవర్ధనగిరి, గౌరవెల్లి, సోలాక్‌పూర్‌, దూల్మిట్ట సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. పోలింగ్‌ ప్రాంతాలకు ఇప్పటికే జియోట్యాగింగ్‌ పక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించే వారిపై నిఘా పెట్టారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తులో పాల్గొంటారని వివరించారు.