పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పండి
ఆదిలాబాద్, జనవరి 20: పోలియో రహిత సమాజాని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా కలెక్టర్ అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టర్ అశోక్‌పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 3,065 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, 120 ప్రత్యేక సంచార వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆదివారం నాడు పోలియో చుక్కలు వేస్తున్నామని, ఈ నెల 21, 22 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోలియో కార్యక్రమంలో 3,96,630 మంది చిన్నారులకు పోలియో చుక్కలను వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 12,260 మంది సిబ్బంది పాల్గొన్నారు.