పోలీసుల అదుపులో దొంగ
సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి పట్టణం నడిబొడ్డులో ఓ దొంగ వరుస చోరీలకు పాల్పడ్డాడు. ఒకే నెల వ్యవధిలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సాగర్ మెడికల్ దుకాణం తో పాటు పక్కనే ఉన్న కేశవ మెడికల్ దుకాణం, మరో ప్రైవేటు క్లినిక్ ను టార్గెట్ చేస్తూ వరుసగా చోరీలకు పాల్పడిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా వారం క్రితం ఐబి ఎదురుగా కూడా మరో మెడికల్ షాప్, ఇతర చోట దొంగతనం చేసి అందినకాడికి డబ్బులు దోచుకెళ్లాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించి ఎట్టకేలకు నిందితుని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అదుపులో ఉన్న నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇతను పలు కేసులలో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.