పోలీసుల కాల్పులపై ఒబామా సంచలన వ్యాఖ్యలు

పోలీసుల కాల్పులపై ఒబామా సంచలన వ్యాఖ్యలు
 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని నల్లజాతీయులపై పోలీసులు చేసిన కాల్పులు జాతివివక్షలానే కనిపిస్తోందని ఆయన అన్నారు. నాటో సమావేశం కొరకు పోలెండ్ లోని వార్సాకు చేరుకున్న ఒబామా మీడియాతో మాట్లాడారు. ఇలాంటి క్రూరమైన ఘటనల వల్ల అమెరికన్లందరూ ఇబ్బందులకు గురవుతారని వ్యాఖ్యానించారు. ఈ వారంలో నల్లజాతీయులపై పోలీసులు జరిపిన కాల్పులు కావాలని చేసినవిగానే కనిపిస్తున్నాయని అన్నారు.

అమెరికా క్రిమినల్ జస్టిస్ సిస్టం చూపుతున్న గణాంకాల్లో ఎక్కువ మంది నల్ల జాతీయులనే కాల్చడం లేదా అరెస్టు చేయడం లాంటి చర్యలు పోలీసులు చేశారని అన్నారు. తెల్లజాతీయులతో పోలిస్తే 30 శాతానికి పైగా నల్లజాతీయులను పోలీసులు అడ్డగిస్తున్నారన్నారు. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువసార్లు వారిని పరిశీలిస్తున్నారని తెలిపారు. గత ఏడాది కాలంలో తెల్లజాతీయుల కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మంది నల్లజాతీయులను పోలీసులు కాల్చారని పేర్కొన్నారు. రెండు రెట్లు అధికంగా నల్లజాతీయులను అరెస్టు చేశారని చెప్పారు.

సరైన పత్రాలను వెంటతెచ్చుకున్నా 75 శాతం కన్నా ఎక్కువ కేసులు నల్లజాతీయులపైనే నమోదయ్యాయని ఒబామా తెలిపారు. వీరిలో 10 శాతం మందికి శిక్ష కూడా పడినట్లు వివరించారు. అదే తప్పు చేసిన తెల్లజాతీయులకు ఎలాంటి శిక్ష లేకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ వాస్తవాలని, కేవలం చర్మం రంగు నలుపుగా ఉండటం వల్లే వారిపై వివక్షను చూపుతున్నారని బాధపడ్డారు. ఇది కేవలం నల్లజాతీయుల సమస్య కాదని దేశం మొత్తం ఈ సమస్య కారణంగా ఇబ్బందులపాలవుతుందని అన్నారు.

మిన్నెసోటా, లూసియానాల్లో అమెరికన్ పోలీసులు ఇద్దరు నల్ల జాతీయులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై స్పందించిన ఒబామా నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యం అంటే మిగిలిన వారి ప్రాణాలు తృణప్రాయం కాదని, ఎవరిదైనా జీవితమే అనే అన్నారు. దేశంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎక్కువ మంది నల్లజాతీయులే బలవుతుండటం బాధకరమన్నారు.