పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి.
రక్తదానం మహదానం. -రక్తదానంపై అపోహలు వద్దు.
– రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి.
బెల్లంపల్లి, అక్టోబర్ 18, (జనంసాక్షి)
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. పేద ప్రజలు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే అమరుల త్యాగానికి నిజమైన నివాళి అని తెలిపారు. థలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్ కేన్సర్ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బుల తో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని కమిషనర్ అన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 6 నెలలకొకసారి రక్తదానం చేయాలని సూచించారు. 2500 మందితో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 2360 యూనిట్ల రక్తం సేకరించడం చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. పెద్ద ఎత్తున మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, సబ్ డివిజన్ పోలీస్ అధికరులను కమిషనర్ అభినందించారు. అదేవిధంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన పోలీస్ సిబ్బంది, యువత కు ప్రజలందరికీ వాలంటీర్లకు కృతజ్ఞతలు, తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఏడ్ల మహేష్, బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు, బెల్లంపల్లి టౌన్ సీఐ రాజు, మందమర్రి సీఐ ప్రమోద్ రావు, తాండూర్ సీఐ జగదీష్, సబ్ డివిజన్ ఎస్ఐ లు, రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులు, సిబ్బంది, యువత, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.