పోలీస్‌ స్టేషన్లలో వాహనాల వేలం


డిఐజి ఏ.వి. రంగనాధ్‌ వెల్లడి
ఫ్లాగ్‌ డే సందర్భంగా రక్తదాన శిబిరం
నల్లగొండ,అక్టోబర్‌27( జనం సాక్షి);  వివిధ కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో మూలనపడ్డ వాహనాల వేలానికి రంగం సిద్దం అయ్యింది. వీటి యజమానులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలం వేయాలని నిర్ణయించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వివిధ కేసులలో ఉన్న వాహనాలను వేలం వేయనున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్‌ తెలిపారు. జిల్లాలోని ఆయా పోలీస్‌ స్టేషన్లలో వివిధ కేసులలో ఉండి వాటి యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు, గుర్తు తెలియని వాహనాలను జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణా కేంద్రం (డిటిసి)కి తరలించినట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 853 వాహనాలను వేలం వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వాహనాలకు సంబందించిన పూర్తి వివరాలను జిల్లా పోలీస్‌ శాఖ అధికారిక ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌ లలో పొందుపర్చినట్లు వివరించారు. వాహనాల యజమానులు, ఆరు నెలల వ్యవధిలో సరైన ధృవ పత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని, లేనట్లయితే వాటిని వేలం వేస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎం.టి. విభాగం ఆర్‌.ఐ. శ్రీనివాస్‌ (9440700078), వెల్ఫేర్‌ ఆర్‌.ఐ. నర్సింహా చారి (8499908194) లను సంప్రదించాలని ఆయన సూచించారు.ఇదిలావుంటే పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్‌ అన్నారు. ప్లాగ్‌ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఎª`లాగ్‌ డే లో భాగంగా రక్తదానం చేసిన సిబ్బంది, యువతను ఆయన అభినందించారు. విధి నిర్వహణలో కర్తవ్యమే లక్ష్యంగా ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్తదానంలో పాల్గొనేందుకు యువత సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం వల్ల మరొకరికి ప్రాణదానం జరుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ఎలాంటి తారతమ్యం, కుల మతాలకు, తావు లేకుండా రక్తదానం చేయాలన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను ఈ సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం పోలీస్‌ ప్లాగ్‌ డే నిర్వస్తామన్నారు. కార్యక్రమంలో డిటిసి ఎస్పీ సతీష్‌ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆర్‌.ఐ.లు స్పర్జన్‌ రాజ్‌, నర్సింహా చారి, కృష్ణారావు, నర్సింహా, వన్‌ టౌన్‌ సిఐ బాలగోపాల్‌, టూ టౌన్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ సిఐ చీర్ల శ్రీనివాస్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిఐ కె. అదిరెడ్డి, టూ టౌన్‌ ఎస్‌.ఐ. నర్సింహులు, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌, నాయకులు సోమయ్య, రెడ్‌ క్రాస్‌ కార్యదర్శి గోలి అమరేందర్‌ రెడ్డి, కోశాధికారి మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, డాక్టర్లు పుల్లారావు, ప్రవళిక, వెంకట్రామ్‌, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్‌ గుప్త, ఏ.ఆర్‌., రెడ్‌ క్రాస్‌ సిబ్బంది, తైక్వండో శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.