పోలేపల్లి, ఫ‌తేపురం ముఖ్య నాయ‌కుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి స‌మావేశం

వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన అస్త్రం

పార్టీ విజ‌యానికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆదేశం

తొర్రూరు/ప‌ర్వ‌త‌గిరి, ఆగ‌స్టు 28 ః
రానున్న ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం క‌లిసిక‌ట్టుగాప‌ని చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి నియోజక‌వ‌ర్గం తొర్రూరు మండ‌లం పోలేప‌ల్లి, ఫ‌తేపురం గ్రామాల ముఖ్య నాయ‌కుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలోని త‌న స్వ‌గృహంలో మంత్రి ఎర్ర‌బెల్లి ఆ రెండు గ్రామాల ముఖ్య నాయ‌కుల‌తో క‌లిసి స‌మావేశం అయ్యారు. మంత్రి ముందుగా కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌ల‌ను, పార్టీలో స‌మ‌న్వ‌యం గురించి ఆరా తీశారు. వారికి తాను అండ‌గా ఉంటాన‌ని హామీఇచ్చారు. గ‌తంలో ఈ ప్రాంతానికి ముక్కు ముఖం తెలియ‌న వారు వ‌స్తున్నార‌ని, అలాంటివారి ప‌ని ప‌ట్టాల‌ని చెప్పారు. ఎంతో కాలంగా తాను నియోజ‌క‌వ‌ర్గానికి, ప్ర‌జ‌ల‌కు చేస్తున్న సేవ‌ల‌ను, అభివృద్ధి, సంక్షేమాన్ని మంత్రి వారికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్‌, బిజెపిల వైఖ‌రులు ప్ర‌జా వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, అలాంటి వారిని గ్రామాల‌కు వ‌స్తే త‌రిమి కొట్టాల‌ని చెప్పారు. ఇంటి పార్టీ బిఆర్ ఎస్ కు ఉన్న క‌ట్టుబాటు మ‌రే పార్టీకి ఉండ‌ద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రే పార్టీకి, ఇత‌ర వ్య‌క్తుల‌కు అవ‌కాశం లేకుండా, త‌న‌ను, బిఆర్ ఎస్ పార్టీని విజ‌యం తీరాల‌కు చేర్చాల‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో ఆయా గ్రామాల ముఖ్య నాయ‌కుల‌తోపాటు, మండ‌ల పార్టీ ముఖ్య నేత‌లు, పార్టీ బాధ్యులు, ప్ర‌జాప్ర‌తినిధులు, గ్రామ పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, అనుబంధ సంఘాల నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.