పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా..
శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, జనవరి18(జనంసాక్షి) : పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమితులైన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పౌరసరఫరాల భవన్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇర్కోడు సర్పంచ్‌గా 1987 రాజకీయ జీవితం ప్రారంభించిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1994 నుంచి సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వరుసగా మూడుసార్లు పనిచేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత 2001లో జరిగిన ఉపఎన్నికలో శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ తరఫున సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. ప్రత్యేక రాష్ట్ర సాధ న కోసం శ్రీనివాస్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కేసీఆర్ వెన్నంటే ఉండి అంచలంచెలుగా ఎదిగారు. నాటినుంచి దాదాపు పార్టీకి సంబంధించిన ప్రతి బహిరం గసభ ఏర్పాట్లలో శ్రీనివాస్‌రెడ్డి పాత్ర ఉన్నది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ అభివృద్ధికి కృషిచేశారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర సివిల్సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.