ప్రకాశం బ్యారేజికి కొనసాగుతున్న వరద
విజయవాడ,ఆగస్ట్21(జనం సాక్షి): కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలంగాణాలోని ఖమ్మం ఇతర పరీవాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు లక్షన్నర క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తుండటంతో దిగువకు అంతే మొత్తంలో విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి సముద్రంలోనికి 1 లక్షా 43 వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టా కాలువకు 4 వేల క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 135 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లనూ మూడు అడుగుల మేర ఎత్తి ప్రవాహాలను దిగువకు విడుస్తున్నట్టు జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కృష్ణా తూర్పు డెల్టాలోని బందరు, ఏలూరు, రైవస్ కాలువలకు రెండో రోజూ నీటి విడుదలను నిలిపివేశారు. అటు పట్టిసీమ పంపులను సైతం నిలిపివేసి పోలవరం కుడి కాలువకు నీటి మళ్లింపును ఆపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 10.2 అడుగుల మేర నీటి నిల్వను కొనసాగిస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.