ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, అక్టోబర్ 20 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో పకృతి వ్యవసాయం పై రెండు రోజులు శిక్షణ ఈ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి  రైతులు ఉద్దేశించి మాట్లాడుతూ విదేశీ పరిజ్ఞానాన్ని వదిలిపెట్టి వ్యవసాయంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సాదిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.  పెరుగుతున్న భూతాపం వాతావరణ మార్పులకు ప్రస్తుత వ్యవసాయం విధానం ప్రధాన పాత్ర పోషిస్తూందన్నారు. వీటని ఎదుర్కొనే ధీటైన పరిష్కారం స్వదేశీ పరిజ్ఞానంతో పెట్టుబడులేని ప్రకృతి వ్యవసాయం ఒక్కటేనన్నారు. విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. దీంతో 10 శాతం విద్యుత్ వాడకం 10 శాతం నీటి వాడకం సరిపోతుందన్నారు. అందుకే దీనిని పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం అంటారన్నారు. ఈ కార్యక్రమంలో కె వి కె ఇన్చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లవకుమార్ మాట్లాడుతూ రైతులు కేవలం ఒకే రకమైన పంటలు వేసుకోకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను పాటిస్తూ అధిక దిగుబడులను సాధించవచ్చని తెలిపారు. వ్యవసాయంలో సేంద్రియ విధానంలోనే రైతులు చేపల పెంపకం పట్టు పురుగుల పెంపకం వివిధ కూరగాయలు  పండ్లతోలపై పాటించే వివిధ పద్ధతులను ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో నేర్పిస్తారని  తెలిపారు. హుజూర్నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయంలో అధికంగా ఎరువులు  పురుగు మందులు పిచికారి ద్వారా నేల వాతావరణం ఆహారం కలుషితమై రైతులకు పెట్టుబడి ఖర్చు పెరగడానికి కారణమవుతున్నాయని అన్నారు. కావున రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ భారతి ఎన్జీవో  ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా మాట్లాడుతూ రైతులు కేవలం పంటలపై దృష్టి సాదించకుండా పశువులను పెంచడం ద్వారా రెండు విధాలుగా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. గో ఆధారిత వ్యవసాయం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న మహిళ రైతు యం శశికళ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా తను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం యొక్క ఉపయోగాలను దాని వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.వి.కె శాస్త్రవేత్తలు కిరణ్,నరేష్, మాధురి, ఆదర్శ్,నరేశ్, సుగంధి ఉమ్మడి నల్గొండ జిల్లా  ఐ ఎఫ్ ఎఫ్ సి ఓ మేనేజర్ వెంకటేశ్, రైతులు నరేశ్, రామకృష్ణ, సైదులు, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.