ప్రగతిరథచక్రాలు ఆగకూడదనే ముందుకు పోతున్నాం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో కార్యక్రమాల అమలు
మేనిఫెస్టోలో పెట్టనివి కూడా అమలు చేశాం
నిరంతర కరెంట్‌ ఇచ్చిన ఘనత మాది
వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలు గెలుస్తాం
– 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తాం
– ప్రతి నియోజకవర్గంలో సభలో పాల్గొంటా
– నవంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు!
– తెలంగాణకు పట్టిన అతిపెద్ద దరిద్రం కాంగ్రెస్‌
– రాహుల్‌ గాంధీ పెద్ద బఫూన్‌
– ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఎవరితోనూ పొత్తు ఉండదు
– మజ్లిస్‌తో మాకున్నది స్నేహపూర్వ సంబంధమే
– టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పొత్తు అనడానికి సిగ్గుండాలి
– ఏమాన్నా అంటే ఎన్టీఆర్‌ కంటే మొగోడా అంటున్నారు.. కాకూడదా?
– చెన్నారెడ్డి తెలంగాణ సాధనలో విఫలమయ్యాడు.. నేను సాధించా
– విలేకరుల సమావేశంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రగతి చక్రం ఆగిపోకూడదన్‌నదే టిఆర్‌ఎస్‌ సంకల్పమని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి కాకూడదనే సంకల్పించామని అన్నారు. నాలుగేళ్లుగా చేస్తున్న అభివృద్ది సాగాలంటే తాము మాత్రమే అధికారంలో ఉండాలని అన్నారు. అందుకే రాజకయీంగా వస్తున్న సవాళ్లకు జవాబిచ్చి, ప్రజాక్షేత్రంలో తేల్చుకునేం దుకు ఎన్నికలకు వెళుతున్నామని అన్నారు. అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి, గవర్నర్‌కు లేఖ అందచేసిన అనంతరం మంత్రులు,పార్టీ సీనియర్లతో కలసి తెలంగాణ భవన్‌లో  విూడియాతో మాట్లాడారు. అనేక అంశాలపై సుదీర్థంగా చర్చించారు. అంతేగాకుండా 105 మందికి టిక్కట్లు ఖరారు చేస్తూ సంచలనానికి తెరతీసారు. త్యాగాలు తెరాసకు, కెసిఆర్‌కు లెక్క కాదన్నారు. అందుకే ఇప్పుడు మరోమారు త్యాగానికి సిద్ద పడ్డామని అన్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇతర పార్టీలు తెలంగాణ అభివృద్దిని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, నిందలు మోపారని అన్నారు. అయినా ఓర్పుతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎన్నికలు అంటే భయం లేదంటూనే ముందే ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద దరిద్రమని అన్నారు. ఆనాడూఈనాడూ తాను అదే చెప్పానని అన్నారు. ఇకపోతే హుస్నాబాద్‌తో సభ ప్రారంబించి ఎన్నికల క్షేత్రంలోకి వెళుతున్నామని అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తామని, ప్రతి నియోజకవర్గంలో జరిగే సభలో తాను పాల్గొంటానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ పేదల గురించి ఆలోచించదని ఆరోపించారు. సమైక్య పాలనలో సంక్షేమం కుంటుపడటంతో తాము అణగారిన వర్గాలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకొచ్చారు. సంపద పెంచడం..పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని విపక్షాలకు సవాల్‌ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో
పొత్తులు ఉండవని,  ఒంటరిగానే పోటీ చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 100కు పైగా స్థానాలు గెలుస్తాం. టీఆర్‌ఎస్‌ సెక్యూలర్‌ పార్టీ, సెక్యులర్‌గానే ఉంటామన్నారు. త్యాగాలు ఎవరైనా చేశారంటే అది తామేనని, త్యాగాలు చేసిన టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెల్యూట్‌ అన్నారు. 82 నియోజకవర్గాల్లో 60 శాతం పైనా ఓట్లు వస్తాయని, 100 స్థానాల్లో 50 శాతం పైనా ఓట్లు వస్తాయని సీఎం తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వందకు పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ఏ రాష్ట్రంలోనైనా 20 ఎంపీ సీట్లు గెలుస్తమని కాంగ్రెస్‌ చెప్పగలదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.
శుక్రవారం నుంచే ఎన్నికల కార్యాచరణ…
శుక్రవారం మంచి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. ఇవి ముందస్తు ఎన్నికలు కావని, సాధారణ ఎన్నికలకు ఆరు నెలల గడువు ఉంది కాబట్టి.. ఎన్నికల జోన్‌లోనే ఉన్నామన్నారు. 50రోజుల్లో 100 ఎన్నికల సభలు నిర్వహిస్తామని, 20 ఏండ్ల నుంచి కేసీఆర్‌ ఏం చేసినా తెలంగాణ మంచికోసమే చేశానని కేసీఆర్‌ తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో లేని 76 అంశాలను అమలు చేశామని, త్వరలోనే కే కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏం చేసింది.. చేయబోయేది అన్నీ మేనిఫెస్టోలో చెబుతామన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని ప్రజలంతా చల్లగా బతకండి అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.
నాలుగేళ్లలో ఆర్థిక ఎదుగుదల 17.17 శాతం ..
ఈ నాలుగేళ్లలో తెలంగాణ ఆర్థిక ఎదుగుదల 17.17 శాతంగా ఉందని కేసీఆర్‌ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రం సాధించిన ప్రగతి 21.96 శాతంగా ఉందన్నారు. అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఈ మధ్య రాజకీయాల్లో అసహనం చూస్తున్నామన్నారు. అది మంచిది కాదని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పసలేనివని కేసీఆర్‌ కొట్టిపారేశారు. భయంకరంగా ఆరోపణలు చేస్తున్నామన్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ పూర్తిగా ధ్వంసమైతే.. కాంగ్రెస్‌ సన్నాసులు పట్టించుకోలేదని, గత ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగం కోసం ఖర్చు చేసింది 25 వేల కోట్లన్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్ది విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆగకూడదన్నారు.  దేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతిని సాధించామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని ప్రధాని సహా అనేక రాష్ట్రాల సీఎంలు కొనియాడారని తెలిపారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల్లో కవిూషన్లు తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల్లో వాస్తవాలు లేవని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. ఒక సాక్ష్యం, ఆధారం లేకుండా ఇష్టారీతిన విమర్శలు చేయడం సరికాదన్నారు కేసీఆర్‌.
నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..
రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్‌ అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్‌ మొదటివారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
తెలంగాణ ప్రగతి రధ చక్రం ఆగకుండా కొనసాగాలంటే రాష్ట్రం మళ్లీ టీఆర్‌ఎస్‌కే అప్పగించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలనే తాము తీసుకుంటామనే విశ్వాసం ప్రజలకు ఉందన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హావిూలన్నింటినీ నెరవేర్చామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో పొందుపరచని పలు పధకాలను ప్రవేశపెట్టామన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను మేనిఫెస్టోలో
లేకున్నా ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.
రాహుల్‌ దేశంలోకెల్లా అతిపెద్ద బఫూన్‌..
తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతరం విూడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని దేశంలోకెల్లా అతి పెద్ద బఫూన్‌గా కేసీఆర్‌ అభివర్ణించారు. సభలో మోదీకి రాహుల్‌ కన్నుగీటడం, హత్తుకోవడం పట్ల కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ను వారసుడిగా పేర్కొన్న కేసీఆర్‌.. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని తెలంగాణ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు విషయమై కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలని ఘాటుగా స్పందించారు. తెలంగాణ మళ్లీ ఆంధ్రా పార్టీలకు గులాం గిరీ చేయొద్దని సూచించారు. తెలంగాణ వాళ్లే శాసనకర్తలుగా ఉండాలని, ఆంధ్రా పార్టీలతో పొత్తు ఏంటని  ఆయన నిలదీశారు. ఎన్టీఆర్‌ కంటే మొగోడా కేసీఆర్‌ అన్నారని.. కావొద్దా అని ప్రశ్నించారు. చెన్నారెడ్డి కంటే మొగోడా అన్నారు. తెలంగాణ తేవడంలో చెన్నారెడ్డి విఫలమైతే.. నేను సాధించాను అని కేసీఆర్‌ తెలిపారు. అసదుద్దీన్‌ ఓవైసీ తనంతట తానుగా నాకు ఢిల్లీలోనే ఫోన్‌ చేసి మద్దతు ఇస్తానని ప్రకటించారని అన్నారు. ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ అని, కలిసి పని చేస్తున్నామన్నారు. స్నేహపూర్వకంగా పోటీ ఉండొచ్చు కానీ, మేం సెక్యులర్‌ పార్టీ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీకి దగ్గరవుతున్నామని ప్రచారం చేస్తున్నారని, నాకు ఆయనతో చాలా అవసరాలుంటాయని కేసీఆర్‌ కుండబద్దలుకొట్టారు. ప్రధానితో మాట్లాడటం తప్పా అని నిలదీశారు. మోదీతో నాకుంది ప్రభుత్వమైన అనుబంధమేనని, మజ్లిస్‌తో కలిసి ఉండే టీఆర్‌ఎస్‌తో స్నేహం ఉండదని బీజేపీ అధ్యక్షుడే చెప్పారని కేసీఆర్‌ తెలిపారు.