ప్రగతి చూడండి.. పట్టం కట్టండి
– ఆరేళ్ల అభివృద్ధిపై నివేదిక
– హైదరాబాద్ నగరానికి కేంద్రం చేసింది ఏమీలేదు
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,నవంబరు 20(జనంసాక్షి):మహానగరంలో గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధిపై ప్రగతి నివేదికను ఇంటింటికీ చేర్చాలని అభ్యర్థులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో ప్రగతి నివేదికను తెలంగాణ భవన్‌లో ఆయన విడుదల చేశారు. పోటీలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టికెట్లు వచ్చిన వారు నిరాశ చెందిన వాళ్లను కలుపుకొనిపోయి విజయం సాధించాలని మంత్రి సూచించారు. ఈ పది రోజులూ నిరంతరం శ్రమించి గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు.ప్రభుత్వ ప్రగతిని నివేదించాల్సిన బాధ్యత మనపై ఉందని అభ్యర్థులకు కేటీఆర్ గుర్తు చేశారు.హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి పనులు చేశామో ప్రజలందరికీ తెలియజేయాలన్నారు. నగరంలోని మొత్తం 150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చట్టం తెచ్చారని, అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశామని చెప్పారు. 85 డివిజన్లు మహిళలకే కేటాయించామన్నారు. ఎస్సీలకు 10 స్థానాలే రిజర్వు అయినా 13 సీట్లు కేటాయించిన ఘనత తెరాసకే దక్కుతుందన్నారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున తెరాస అభ్యర్థులు బీ ఫామ్ సమర్పించిన తర్వాతే జనంలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు.హైదరాబాద్ ప్రజల తాగునీటి గోసను తప్పించింది తెరాస ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు. మంచినీటి సమస్యను 95శాతం వరకు పరిష్కరించామన్నారు. ” 1920లో గండిపేట రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదు. హైదరాబాద్‌లో కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాం. ఆరు నెలల్లో కేశవాపురం రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2050 వరకు తాగునీటికి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది” అని కేటీఆర్ అన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ తెరాస హయాంలోనే వచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. తెరాస ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌లో పేకాట, గుడుంబా క్లబ్లులు మూతపడ్డాయని, రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు. ”హైదరాబాద్‌లో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణకు ఆర్థిక ఇంజిన్ హైదరాబాద్.. భాగ్యనగరం బాగుంటేనే తెలంగాణ ఉజ్వలంగా దూసుకెళ్తుంది” అని కేటీఆర్ అన్నారు. విజయగర్వం లేకుండా అందరూ అణకువగా ఉండాలని కేటీఆర్ హితవు పలికారు.రెండు అంశాల గురించి ఆలోచించాలని ప్రజలకు చెప్పాలని అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా?నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలా?అని ప్రజలను ప్రశ్నించాలన్నారు. ” తెరాస ప్రభుత్వం గత ఆరేళ్లలో చేసిన పనులు వంద చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన ఒక్క పనిని చూపెడతారా?ఆరేళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకెళ్తున్నాం. అభివృద్ధి హైదరాబాదా? అశాంతి హైదరాబాదా? అన్నది ప్రజలే తేల్చుకోవాలి.” అని కేటీఆర్ అన్నారు.హైదరాబాద్‌లో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుందని, ఆరున్నర లక్షల మందికి రూ. 650 కోట్లు సాయం అందించామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి జరిగిన వరద నష్టంపై కేంద్రానికి సీఎం లేఖ రాసినప్పటికీ, ఇప్పటివరకు సాయం అందలేదని అన్నారు. ఇంటింటికీ వెళ్లి తెరాస చేసిన పనుల గురించి చెప్పి ఓట్లు అడగాలని సూచించారు.