ప్రచారం చేస్తూనే కుప్పకూలిన బిజెపి ఎమ్మెల్యే

చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందిన విజయకుమార్‌
బెంగళూరు,మే4(జ‌నం సాక్షి ):  కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం జయనగర్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి బీ ఎన్‌ విజయ కుమార్‌ (59) గుండెపోటుతో మృతి చెందారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను జయదేవ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాక్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. జయనగర్‌ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఆయన ప్రముఖ నేతగా పేరొందారు.  ఈ నెల 12న జరిగే ఎన్నికల్లో గెలిచి, హ్యాట్రిక్‌ సాధించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రత్యర్థి కర్ణాటక ¬ం మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి.
ఎన్నికల ప్రచారం చేస్తూ గుండెపోటుతో మృతిచెండంతో బిజెపి నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం జయనగర్‌, పట్టాభిరామనగర్‌ ప్రాంతంలో ఆయన కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో తీవ్రమైన ఛాతీనొప్పితో కుప్పకూలారు. ఆయన్ని వెంటనే కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  విజయ్‌కుమార్‌ మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతూ బిజెపి ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ప్రకటనలో పేర్కొంది.