ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎస్సై గోకారి

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 అల్పపిడనం కారణంగా 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటిక్యాల ఎస్సై గోకారి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు తమ పిల్లలను వాగుల వైపు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున మత్స్యకారులు, ప్రజలు ఎవరు చాపల వేటకు వెళ్లకూడదన్నారు. పాత మిద్దెల కింద, పాత గోడల పక్కన, తడిసిన స్తంభాలను ముట్టుకోకూడదు అన్నారు. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను పొడిగా ఉన్న కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో స్విచ్ వేయాలన్నారు. చిన్న పిల్లలను కరెంటు వస్తువుల దగ్గరికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులలో 100 కి డయల్ చేసి పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎస్సై గోకారి తెలిపారు.