ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి పల్లె నిద్ర

మంథని, న్యూస్‌లైన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి శ్రీధర్‌బాబు పల్లెనిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌ పుట్ట మధు విమర్శించారు. శనివారం మంథనిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు బానిసలుగా చూసిన మంత్రి ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకబోస్తుండడంపై ప్రజలు ఆలోచించాలన్నారు.

2007లో మహాముత్తారం మండలం కనుకునూర్‌లో పల్లెనిద్ర చేసిన మంత్రి మరునాడు రెడ్డిపల్లెలో పర్యటించారని, ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి సమస్యపై విన్నవించగా రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పినేటికీ పట్టించుకోలేదన్నారు. ఓ కాంట్రాక్టర్‌ వేసిన బోరు నుంచి ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారని, ఇదే మంత్రి చేసిన అభివృద్ధిని సూచిస్తోందని ఎద్దేవా చేశారు. 2011లో కాటారం మండలం గూడూరులో పిట్టల లచ్చక్క అనే నిరుపేద ఇంట్లో బస చేసిన మంత్రికి ఆ మహిళ పడుతున్న కష్టాలు కన్పించలేదా అని ప్రశ్నించారు. ఆమె నేటికి అదే గుడిసెలో జీవిస్తోందని, కనీసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని అవేదన వ్యక్తం చేశారు.

మంత్రి బస చేసిన గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారని, ఆనాడు విప్‌గా, నేడు మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు విఫలమయ్యారని విమర్చించారు. నక్సల్స్‌ ప్రభావిత గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరైన ఐఏపీ నిధుల దుర్వినియోగంపై మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయా గ్రామాల్లోని యువత ఆనాడు కాంగ్రెస్‌ పాలనను భరించలేకనే తుపాకీ పట్టారని, తిరిగి అలాంటి పరిస్థితులు నెలకొనవద్దని ప్రభుత్వం ఐఏపీ నిధులు మంజూరు చేసిందన్నారు. కానీ ఆ నిధులను తానే తీసుకొచ్చినట్టు మంత్రి గొప్పటు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్‌ ఏగోళపు శంకర్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు ఎస్‌కే. యాకూబ్‌, నాయకులు స్టాలిన్‌గౌడ్‌, మంథని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.