ప్రజల్లో నిత్యం ఉండండి
వచ్చేది ఎన్నికల సంవత్సరమని గుర్తుంచుకోండి
సమన్వయ కమిటీ సమావేశంలో బాబు హితవు
అమరావతి,జూన్12(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలు ప్రతిరోజు 13 బస్సులలో వెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు 22 వేల మంది ప్రజలు పోలవరాన్ని సందర్శించారన్నారు. ఒక ప్రాజెక్టు కోసం ఇంతగా కష్టపడుతున్న సందర్భం.. దేశంలో ఎక్కడాలేదన్నారు. ‘విూకు నా నుండి ఎప్పుడైనా ఫోన్ రావచ్చు’నని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం, రాష్ట్రం కోసం కఠినంగా ఉండక తప్పదని, వింటే వ్యక్తిగతంగా చెప్తా, వినని పక్షంలో ప్రజల్లోనే చెప్తానని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం చేసిన పనులపై ప్రచారం విస్తృతంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రింట్, ఎలక్టాన్రిక్, సోషల్, మౌత్ ప్రచారంతో ముందుకు సాగాలన్నారు. ఎలా కష్టపడ్డామన్నది కాదని, గెలుపు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలంటే అన్నింటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్ విూడియాను నేతలంతా విస్తృతంగా వాడుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. సహజ వనరులను దోచుకుంటున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో దోచుకోకుండా మిగిల్చింది ఏమైనా ఉందా జగన్? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కింద… సహజ ఖనిజాలు, బాక్సైట్, లైమ్ స్టోన్ తిన్నారని, 13 చార్జిషీట్లలో జగన్ దోచుకున్న మెనూ మొత్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. కొందరు పార్టీ నేతలు ఇప్పటివరకూ సరిగా పని చేయకపోయినా మారుతారులే అన్న భావనతో చర్యలు తీసుకోలేదని సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తానేవిూ పట్టించుకోవటం లేదనుకుని ఏదైనా చేయొచ్చు అనే భావనలో కొందరు నేతలున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన దగ్గర ఉన్నాయని.. ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున ఇకపై ఎవరి నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోనని తేల్చిచెప్పారు. ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్‌ని వేదికగా ఎంచుకున్న సంఘటనను సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. అలాంటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్‌ని పూర్తిగా నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
కేంద్రం మోసాలను ప్రజల్లో ఎండగతాం: కాల్వ
నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రతి ఏడాది ప్రజల్లోకి వెళ్తున్నామని, కేంద్రం నమ్మించి మోసం చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమన్వయ కమిటీ ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో ఎలా ముందుకు సాగాలన్నదానిపై చర్చించామన్నారు. రైతు బిడ్డలను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దిన విధానాన్ని సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో మూడో ధర్మపోరాట దీక్ష జరుగుతుందని మంత్రి కాల్వ చెప్పారు. రాయలసీమలో నాలుగో ధర్మపోరాట దీక్ష జరపాలని, వర్సిటీల వారీగా 10 సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కాల్వ తెలిపారు. అలాగే బీసీలు, గిరిజనుల చైతన్యయాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు.