ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే తన ప్రథమ లక్ష్యం : ఈటెల
కరీంనగర్‌,జూలై30 ( జనంసాక్షి):   తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ప్రజాగ్రహానికి గురికాక తప్ప దన్నారు. తన సవాల్‌ను స్వీకరించి సమాధానం చెప్పే దమ్ములేక కేసీఆర్‌, తన బానిసలతో ప్రెస్‌విూట్‌లు పెట్టించి అవమానకరమైన భాష మాట్లాడిరచారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఓడగొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకకు అర్థం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్‌ కంటే వేగంగా దూసుకుపోతోందని తెలిపారు. కేసీఆర్‌పై హుజురాబాద్‌ లేదా గజ్వేల్‌ ఎక్కడైనా సరే తాను ఫోటీకి సిద్ధమని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ పోటీకి దిగుతానని పదేపదే ఈటల ప్రకటిస్తూ వస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే హుజూరాబాద్‌ గడ్డపై పోటీకి రావాలని సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ లో కేసీఆర్‌ కంటే తనకే ఎక్కువ వ్యక్తిగత పరిచయాలున్నాయని వెల్లడిరచారు. మరోవైపు తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కమలనాథులు బహుముఖ వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీకి 30 సీట్ల వరకు వస్తాయని తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో రాబోయే మూడు నెలలు తెలంగాణలోని 119 నియోజకవర్లాల్లో ఉధృతంగా పర్యటించి, పార్టీని పటిష్ఠం చేసిన తర్వాత పరిస్థితిలో గుణాత్మకమైన మార్పు వస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలూ ఉన్నందున డిసెంబరులోపు ప్రతి గ్రామంలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. కేసీఆర్‌ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు తిప్పుకొనేందుకు కమల దళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీని అభిమానించే వివిధ భాషలు,
సంస్కృతులకు చెందిన వారు తెలంగాణలో ఉన్నారు. వారిని సంఘటితం చేసుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను ఆకర్షించేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఏపీలో జగన్‌ నేతృత్వంలోని వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు ఏర్పరచుకోవడంపై సీమాంధ్రకు చెందిన అనేకమంది తెలంగాణలో బీజేపీని వ్యతిరేకించవచ్చునని, అలా జరగకుండా చూసుకునేందుకు పలువురు సీమాంధ్ర ప్రముఖులతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది.