ప్ర’జల’ కష్టాలు
చేతిపంపుల వద్ద బారులు
మోటార్ల మరమ్మతుపై నిర్లక్ష్యం
జన్నారం, న్యూస్‌లైన్: వేసవి ఆరంభంలోనే ప్ర’జల’ కష్టాలు మొదలయ్యాయి. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు .చేసిన మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారండంతో పరిస్థితి దాహార్తి తీర్చేందుకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గుక్కెడు నీటికోసం నానా అవస్థలు పడుతున్నారు. ఏటా నీటి ఎద్దడి ఎదురవుతున్నా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో 1800 మంది జనాభా ఉన్నారు. 90 వేల లీటర్ల సామర్థ్యం గల ఓకే రక్షిత మంచినీటి పథకం ఉంది. ఆరు నెలల క్రితం మోటారు చెడిపోయింది. ఇప్పటికీ మర్మత్తుకు నోచుకోలేదు దీంతో ట్యాంక్ నిరుపయోగంగా మారింది. బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మే మాసం వచ్చే సరికి ఆ బావుల్లో కూడా నీరు అడుగంటుతుండడంతో సమీపంలోని వాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. దేవునిగూడ గ్రామ పంచాయతీ పరిధి లోతొర్రే గిరిజన గ్రామం. ఇక్కడ సుమారు 500 మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో రెండు చేతిపంపులు ఉన్నాయి. నడి వేసవిలో ప్రతియేటా ఒకదాంట్లో నీరు అడుగంటి నిరుపయోగంగా మారుతుంది. దీంతో వాగులు నుంచి నీరు తెచ్చుకుంటారు.
తలాపునే గోదారి.. తాగేందుకు నీరేది..!
ధర్మారం, రాంపూర్, తపాలపూర్, కలమడుగు తదితర గ్రామాల తలాపునే గోదావరి నది ప్రవహిస్తోంది. అయిన ఆ గ్రామాల్లో నీటి ఎద్దడి తప్పడం లేదు. రాంపూర్‌లో 1950 జనాభా ఉంది. గోదావరి నదికి విద్యుత్ మోటారు అమర్చారు. కానీ అది చెడిపోయి ట్యాంక్ నిరుపయోగంగా మారింది. కవ్వాల పారమ్మపల్లి, నడింపల్లి, హరిజన కాలనీల్లో చేతిపంపులకు విద్యుత్ మోటార్లు అమర్చారు. వేలాది రూపాయలు వెచ్చించి మోటార్లు ఏర్పాటు చేసిన రెండు నెలలు కూడా పని చేయలేదు. మోటార్ల మరమ్మత్తు కోసం రూ.30 వేలు కేటాయించినా ఫలితం లేకపోయింది. సర్పంచుల పాలన ముగిశాక ప్రత్యేక అధికారులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కాగా , నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను అంచనా వేశామని, సమస్య ఉన్న గ్రామాల్లో సర్వే చేసి ప్రతిపాదనలు పంపిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ వెంకటపతి తెలిపారు.
పనులు మానుకుంటున్నం
ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నీళ్ల కోసం గోస పడుతున్నాం. ఉన్న బోరింగు కొట్టంగ కొట్టంగ నాలుగు బిందెల నీళ్లు తెచ్చుకుంటాం నీళ్ల కోసం పనులు బందుచేసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాపై దయ ఉంచి ఇంకో బోరింగు వేయించాలి.
-మేకల లచ్చవ్వ, అక్కపెల్లిగూడెం
పట్టించుకుంట లేరు..
ట్యాంకు నిర్మించారు. కానీ మోటర్ చెడిపోవడం వల్ల అది పని చేయడం లేదు. మంచినీరు అందించడంలో అధికారులు పట్టించుకుంటలేరు. ఎవ్వరిని అడుగాలో తెలుస్తలేదు. నీటి కోసం అనేక తిప్పలు పడుతున్నాం.
– వెంకట్, తిమ్మాపూర్
నీటి సమస్య తీవ్రం
మా గ్రాయంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. మంచినీటి ట్యాంకు పని చేయడం లేదు. దీంతో బావులను ఆశ్రయించాల్సి వస్తోంది. బావుల్లో నీరు అప్పుడే అడుగంటిపోతున్నాయి. అధికారులు సమస్యకు పరిష్కారం చూపాలి.
-గంగాధర్, తిమ్మాపూర్
వాగునీరే దిక్కు
ప్రతియేడు నీళ్ల కోసం గోస పడుతున్నం. ఈ సారి ఎవ్వరు నీటి బాధ తప్పించడం కోసం రాలేదు. ఉన్న రెండు బోరింగులో ఒక్కదాంట్లో నీళ్లు రావు, ఇక వాగునీళ్లె దిక్కవుతాయి. సార్లు పట్టించుకుని మా గోస తీర్చాలి.
-భగవంతరావు, లోతొర్రే
ఏటా ఇదే గోస..
ప్రతి సంవత్సరం ఎండాకాలం ఇదే గొస. బావుల్లోని నీళ్లన్ని ఎండిపోయినయి. వాళ్లత్తరు బోరింగు ఏపిస్తామంటరు, వీళ్లస్తరు ట్యాంకు కట్టిస్తమంటరు. ఎవ్వరు ఏమి చేయరు. మా ఊళ్లల్లో ఎప్పుడు ఇదే గోస అయితంది. కిలోమీటరు దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నం, మాకు నీళ్ల సౌకర్యం కల్పించాలి. అధికారులు మా సమస్యలు పరిష్కరించాలి.
– నందిని, లోతొర్రే