ప్రజారక్షణకు తాలిబన్లు భరోసా ఇవ్వాల్సిందే !
అఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు శాంతియుతంగా ప్రభుత్వ మార్పిడి జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచం కోరుకుంటోంది. నిజానికి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గతంలో లాగా కాకుండా తాలిబన్లు కూడా హావిూ ఇవ్వాలి. వారికి తక్షణ రోణ కల్పించాలి. వారికి భరోసా ఇవ్వాలి. వివిధ దేశాల ప్రజలు భయంతో పారిపోతున్న క్రమంలో అక్కడి వారికి పూర్తి రక్షణ కల్పించాలి. అమెరికా కూడా అన్ని దేశాలతో కలసి అక్కడి తాలిబన్లతో చర్చలు జరిపి ప్రశాంత పరిస్థితులకు అవకాశం కల్పించేలా దోహద పడాలి. మరోవైపు తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగవంతం అయ్యాయి. తాలిబన్ సీనియర్ నాయకుడు, హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన అనాస్ హక్కానీ అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హవిూద్ కర్జాయ్‌తో సమావేశం కావడం..చర్చించడం ఆహ్వానించదగ్గ విషం. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడిరచారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన క్రమంలో ఈ చర్యలను ప్రపంచమంతా ఆహ్వానించాలి. మరోవైపు తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడిరచలేదు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రబుత్వం ఏర్పాటుతో పాటు దేశంలో శాంతిని పరిరక్షంచడం ఇప్పుడు తాలిబన్ల ముందున్న ప్రధాన కర్తవ్యం. వారంటే హడలిపోతున్న స్థానిక ప్రజలకు, ఇతర దేశాల ప్రజలకు భరోసా ఇవ్వడం ద్వారా అఫ్ఘాన్‌లో శాంతియుత ప్రభుత్వం ఏర్పడేలా చూడాలి. తాలిబాన్ల వశమైన దేశం నుంచి ఎలాగైనా దాటిపోవాలన్న ప్రయత్నంలో విమానాశ్రయంలో వందలమంది ప్రాణాలకు తెగించిన తీరు ఆందోళన కలిగించేదిగా ఉంది. అఫ్ఘాన్ దుస్థితిని అద్దంపట్టే అనేక దృశ్యాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తున్నది. నిజానికి అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడుతున్న క్రమంలో అనవసరంగా తన పెద్దన్న పాత్ర పోషించేందుకు చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ తాలిబన్లు పుట్టుకుని వచ్చారు. కేవలం రష్యాను నిలువరించే క్రమంలో అమెరికా చేసిన పాపంగా దీనిని గుర్తించాలి. అలాగే ఇంతకాలం అక్కడ తిష్టవేసిన అమెరికా అర్థంతరంగా వదిలిపోయిన ఫలితం ఇది. దేశాధ్యక్షుడే పారిపోతే ప్రజలు మాత్రం చేయగలిగేదేముంది. అందుకే బయంతో పారిపోయారు. మిగతా అగ్రదేశాలు, ఐక్యరాజ్యసమితి వంటివి ఇంతటి సంక్షోభకాలంలోనూ విన్నపాలకే పరిమితం కావడంతో ప్రజలకు భరోసా లేకుండా పోయింది. అధికారమార్పిడి, తాత్కాలిక ప్రభుత్వం వంటి మాటలకు కూడా చోటు దక్కలేదు. తాలిబాన్ పెద్దలంతా ఖాళీగా ఉన్న అధ్యక్షభవనంలోకి ప్రవేశించి, కుర్చీలను ఆక్రమించుకోవడంతో యుద్ధం పరిపూర్ణమైంది, అధికారమార్పిడి జరిగిపోయిందని ప్రకటించుకున్నారు. ఇరవైయేళ్ళక్రితం అమెరికా సైనికులు అఫ్ఘానిస్థాన్‌లోకి చొరబడి, తాలిబాన్‌ను గద్దెదించిన దృశ్యాలు ప్రపంచం ఇంకా మరిచిపోకముందే, అమెరికా తన లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చకుండా వెనక్కి రావడం దారుణం. ఓ రకంగా చెప్పాలంటే ఈ పాపం అమెరికాదే తప్ప మరెవరిదీ కాదు. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించాలన్న అహంకారంతో ఇతర
దేశాల్లో వేలు పెట్టడం వల్లే ఇలా జరిగింది. అంతర్జాతీయస్థాయి చర్చల్లో తాలిబాన్‌ను భాగస్వామిని చేసి దానికి అఖండమైన విలువా గౌరవాలను సమకూర్చిన అమెరికా, అఫ్ఘాన్ ప్రజా ప్రభుత్వానికి మాత్రం తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. తాలిబాన్ తీరులో ఏ మార్పూ రాలేదనీ, అది ఇరవైయేళ్ళనాటికంటే ఆర్థికంగా, భౌతికంగా మరింత బలంగా ఉన్నదని ఇటీవలి దాడులతో బహిర్గతం అయ్యింది. తాలిబాన్ పునరాగమనంతో అఫ్ఘాన్‌లో మారిన పరిస్థితుల ప్రభావాన్ని రాబోయే రోజుల్లో మనం ప్రత్యక్షంగా అనుభవించ వలసి రావచ్చు. అఫ్ఘాన్ చదరంగంలో పాకిస్థాన్ తెలివిగా ఎత్తులు వేసి, వ్యవహారాలను చక్కదిద్దే పని అమెరికా తనకే వదిలిపెట్టేట్టుగా చేసుకుంది. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్ విషయంలో వ్యూహాత్మ కంగా పాకిస్థాన్‌దే పైచేయిగా మారింది. ముందునుంచీ అది తాలిబన్ల పక్షాన పోరాడుతూ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. అఫ్ఘాన్ ప్రభుత్వానికి ఏదో బలం ఉన్నట్టుగా, తాలిబాన్‌తో నేరుగా మాటామంతికి ఏ దశలోనూ ప్రయత్నించలేదు. కిస్థాన్ చెప్పినట్లుగా చైనా, రష్యా తదితర దేశాలు నడుచు కుంటాయి. దశాబ్దంన్నరకు పైగా అక్కడ మనం నిలబెట్టుకున్న ఉనికినీ, పెంచుకున్న ప్రాధాన్యాన్నీ, చేసిన అభివృద్ధినీ సమూలంగా నాశనం చేసే పని మొదలవుతుందనడంలో సందేహం లేదు. తాలిబాన్‌కు వ్యతిరేకంగా నిలిచిన ఫలితంగా ఇతరదేశాలూ ఖండాలతో మనలను అనుసంధానించే పలు ప్రాజెక్టులు నిలిచిపోతాయి. ఇకపోతే తాలిబాన్ పునరాగమనం జిహాదీ శక్తులకు ఊతం ఇవ్వవచ్చు. మొత్తంగా ఇప్పుడు అక్కడ తాలిబన్ల రాజ్యం ఏర్పడబోతున్న క్రమంలో గతంలో లాగా బుద్దవిగ్రహాలను ధ్వంసం చేయడం, అరచకంగా, కిరతాకంగా వ్యవహరించడం, బహిరంగంగా ప్రజలను కాల్చివేయడం వంటి చర్యను తాలిబన్లు సవిూక్షించుకోవాలి. ప్రపంచంతో కలసి తమదేశాన్ని ముందుకు తీసుకుని పోవాలి. అందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న అఫ్ఘాన్ ఇతర దేశాల సాయం లేకుండా ముందుకు సాగడం కష్టం అని కూడా గుర్తించాలి. అప్పుడే వారు విజయం సాధిస్తారు.