ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం
సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు భరోసా కల్పించలేక పోతున్నారు. దరఖాస్తులను సత్వరం పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు అందిన నెలరోజుల్లో సమస్యను పరిష్కరించాలి.. ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. కానీ నెలలు గడుస్తున్నా దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. కనీసం తమ దరఖాస్తు ఎక్కడ ఉందనే విషయం కూడా తెలుసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జవాబుదారీతనం కన్పించడం లేదు. అయినా దూరభారాన్ని సైతం లెక్కచేయకుండా.. ఖర్చుకు వెనకాడకుండా ప్రజావాణికి మళ్లీ..మళ్లీ వస్తూ దరఖాస్తులు సమర్పిస్తూనే ఉన్నారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఆవిర్భవించాయి.. ప్రజలకు అందుబాటులో అధికారులు ఉన్నారు.. వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు.. జిల్లా కేంద్రంలో కలెక్టర్ మొదలుకొని జిల్లాస్థాయి
అధికారులు దరఖాస్తులు స్వీకరించి.. వాటిని ఆయా శాఖలకు పంపిస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది.. అసలు సమస్య.. దరఖాస్తుల పరిష్కారం అంతంత మాత్రమే. ఫలితంగా ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం పోతోంది. మండల కేంద్రంలో వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. అయితే ఆయా మండలాల్లో సజావుగా నిర్వహించకపోవడం, దరఖాస్తులు స్వీకరించడానికి అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో మళ్లీ ప్రజలంతా కలెక్టరేట్‌కు రావడం మొదలుపెట్టారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో స్థాయి అధికారులను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించినా పరిష్కారం లభించడం లేదనే ఆవేదనను దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్నారు. వినతులు ఇచ్చే వారి సంఖ్య వారంవారం పెరుగుతున్నా.. అదే స్థాయిలో పరిష్కారం కావడం లేదు. వృద్ధులు, వికలాంగులు.. గంటల తరబడి వరుసలో ఉంటున్నారు.