ప్రజాసమస్యలు పట్టని సర్కార్
గుంటూరు, జూలై 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. పెదకూరపాడులో తెలుగుదేశంనాయకుడు గుడిపూడి బాబూరావు గృహంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన మంత్రులను రక్షిస్తుందన్నారు. విద్యుత్, రవాణా, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి ప్రజలపై అదనపుభారం మోపుతోందన్నారు. అవినీతి మంత్రులను తొలగించకపోతే ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనా సాగర్‌నీరు కాల్వలకు వదలలేదన్నారు. నీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. డీజిల్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో తెలుగురైతు రాష్ట్ర నాయకులు నాదేండ్ల అప్పారావు న్యాయవాది కన్నె ధారహనుమయ్య, మాజీ ఎంపీ వీజి బాబురావు, బి.రాంబాబు, సి.పేదబాబు, నందిగాం ఆశీర్వాదం, రాజు, ఎన్ సదాశివరావు తదితరులు ఉన్నారు.