ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరం
మోడీ సర్కార్‌పై మండిపడ్డ రాహుల్ గాంధీ
న్యూఢల్లీి,డిసెంబర్14 (జనంసాక్షి ): పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్‌కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చల ప్రాధాన్యత, నిరసన రూపాల గురించి మోదీ ప్రభుత్వానికి ట్యూషన్ అవసరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమైన తొలి రోజే నవంబర్ 29న 12 మంది రాజ్యసభ విపక్ష సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాల్లో అభ్యంతరకరంగా వ్యవహరించినందుకు మోదీ సర్కార్ వారిపై వేటు వేసింది. మరోవైపు రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. రాహుల్ గాంధీ
ఆధ్వర్యంలో సాగే ఈ నిరసన ప్రదర్శన అనంతరం విపక్ష నేతలు విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు గందరగోళం సృష్టిస్తుండటంతో గత కొద్దిరోజులుగా పెద్దల సభలో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష ఎంపీల వరుస నిరసనలతో సమావేశాలు వరుస వాయిదాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో అయితే పరిస్థితి మరోలా ఉంది. 12 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా.. రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మార్చ్ నిర్వహించారు. రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం , రైతుల కనీస మద్దతు ధర, పార్లమెంటులో చర్చ లేకుండా బిల్లులు ఆమోదించే విధానాలపై నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు మార్చ్ నిర్వహించారు. పార్లమెంటులోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు సాగిన మార్చ్ లో నేతలంతా పాల్గొన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష ఎంపీలంతా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు శీతాకాల సమావేశాల ఆఖరి రోజు డిసెంబర్ 23 వరకు మహాత్మగాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష కూడా చేపట్టనున్నారు.