ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కీలకమైనది

` కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.. తన పాత్ర పోషించాలి
` ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు
`అధికార`విపక్ష సంబంధాన్ని భారత్‌`పాక్‌లా ఎందుకు మార్చారు?
` ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత
` ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపు
ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులు
లబ్దిదారుల ఎంపిక ప్రత్యేక మొబైల్‌ యాప్‌
సచివాలయంలో ఆవిష్కరించిన సీఎం రేవంత్‌
` రేపటి నుంచి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు
` పండగ వాతావరణంలో నిర్వహిస్తాం
` విపక్షనేతలకూ ఆహ్వానం అందిస్తాం
` 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం వెల్లడి
(తొలిఏడాదిలోనే 55143 ఉద్యోగాలిచ్చాం)
హైదరాబాద్‌(జనంసాక్షి): అనంతరం భారాస అధినేత కేసీఆర్‌ ను ఉద్దేశించి సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. అసెంబ్లీకి కేసీఆర్‌ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికార, విపక్షాలు అంటే భారత్‌`పాకిస్థాన్‌ తరహాలో పరిస్థితిని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ‘’ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. దీనికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇచ్చి సహకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రిప్రజెంటేషన్‌ ఇచ్చి సమస్యలపై చర్చించేవారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసేవారు. లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పేవారు.ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంప్రదాయం ఉండేది. సభలో కొన్ని అంశాలను చర్చించి.. ఆ తర్వాత ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా అప్పటి మంత్రులను కలిసేవాళ్లం.. నిధులు రాబట్టుకునేవాళ్లం. గత పదేళ్లు ఆ అవకాశం కల్పించలేదు.. సచివాలయానికే రాలేదు. పదేళ్లు విూరేం చేశారని మేం అడగటం లేదు. ప్రజలు అన్నీ గమనించే భారాసను అధికారానికి దూరం చేశారు. ఇప్పటికైనా విూ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. విూ విధానమేంటి? ఆలోచనేంటి? ఈ ప్రభుత్వమే నడవొద్దా?ప్రజలకు సంక్షేమం చేపట్టొద్దా?రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? విూరు సభకే రావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకోవాలి? విూ అనుభవం, చతురతను ఉపయోగించి పాలకపక్షానికి సూచనలు చేయండి. ఏ సూచనా చేయకుండా అడ్డుకుంటామనే విధానంలో ఉండటం తెలంగాణకు మంచిదా? విూ పార్టీ నేతలు తెలియక ఏదైనా అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలి కదా! విూ పిల్లలిద్దరినీ మాపైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారు?ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు?’’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.ఈనెల 7, 8, 9 తేదీల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయ ప్రాంగణం, నెక్లెస్‌రోడ్డులో వేడుకలు నిర్వహిస్తామన్నారు. 3 రోజుల పాటు పండగ వాతావరణంలో ఇవి జరుగుతాయని.. ఈ వేడుకలకు విపక్ష నేతలనూ ఆహ్వానిస్తామని చెప్పారు. ‘’కేసీఆర్‌, బండి సంజయ్‌లకు ఆహ్వానాలు పంపిస్తాం. ప్రజలు, నాయకులు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలి. ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించిన సూచనలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పాలి’’అని రేవంత్‌ సూచించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని సీఎం రేవంత్‌ అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనా.. అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడిరచి ఇళ్లు అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్‌ అందుబాటులోకి తెచ్చామని రేవంత్‌ రెడ్డి వివరించారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని.. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌… ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. లబ్ధిదారులు తమకున్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా.. ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తామని రేవంత్‌ వివరించారు. అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్‌ హౌజ్‌ను చూపిస్తామని చెప్పారు. మొదట ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపు ఉంటుందని రేవంత్‌ స్పష్టం చేశారు. మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని వెల్లడిరచారు. ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామని చెప్పారు. గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా.. ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని.. ఈ పథకం తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. అందుకే ప్రతి పేద వాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకంలో పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించామని సీఎం రేవంత్‌ చెప్పారు. అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు కల్పించామని వివరించారు. ఇదొక పండగ సందర్భమని.. ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కల అని.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలుగుల్లో పండగ చేసుకునే సందర్భమిదని అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణలో తొలిసారిగా అధికారంలో చేపట్టిన కాంగ్రెస్‌ పాలనకు ఏడాది పూర్తి కావొస్తోంది. గత ఏడాది డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. 9వ తేదీన కాంగ్రెస్‌ సర్కార్‌ పీఠమెక్కింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధానంగా ఆరు గ్యారెంటీలను ప్రస్తావించింది. కాంగ్రెస్‌ ప్రకటించిన ‘సిక్సర్‌’ వర్కౌట్‌ కావటంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌ రెడ్డి తొలి సంతకం కూడా ఆరు గ్యారెంటీల హామీలపైనే చేశారు. అంతేకాదు సచివాలయంలో తొలి కేబినెట్‌ భేటీ జరిగింది. ఇందులో కూడా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. పథకాల అమలు కోసం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.