ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో – రాజకీయ దోపిడీ- యదేచ్చగా !

ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకోబడుతున్న భారతదేశంలో రాజకీయ దోపిడీ, అవినీతి అక్రమాలు యదేచ్చగా కొనసాగుతున్న పట్టించుకున్న పాపాన పోయిన ఏ రాజకీయ నాయకుడు లేడు! వేదికలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకొని పోసుకోవడం ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ వ్యవస్థను విమర్శించడమే తప్ప! సాయంత్రం అయితే దిడ్డి దర్వాజా ఒకరికొకరికి తెరిచి ఉంటుంది. ఇది నేడు రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్న తీరు. ప్రజాస్వామ్యం పేరుతో సామాన్య ప్రజలపై ఉక్కు పాదం మోపుతూ యదేచ్చగా దోసుకుంటున్న రాజకీయ వ్యవస్థను పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలిస్తే తప్ప మళ్లీ చిగురించి మళ్లీ అదే ధోరణి వ్యవహరిస్తుంది. ప్రశ్నించే గొంతును నిలువరిస్తూ తమ కార్యక్రమాలను యదేచ్చగా కొనసాగిస్తున్న ప్రజాస్వామ్యక పాలకులు దోచుకున్నది దాచుకున్నది మళ్లీ ప్రజలపై చల్లి రాజ్యాధికారం కాపాడుకోవాలని కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్న రాజకీయ నాయకులను ఒక్కసారి గమనించండి. సామాన్య మానవుల కడుపులు కొడుతూ, అక్రమంగా అన్యాయంగా భూములను దోచుకుంటూ తమ ఖజానా పెంచుకుంటున్న రాజకీయ నాయకుల జీవితాలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!.
1.తెలంగాణ పై నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవు.
బిజెపికి అధికారం కట్ట పెట్టండి అంటూ తెలంగాణ తల్లులు, చెల్లెళ్లకు విజ్ఞప్తి.తెలంగాణను ఓ కుటుంబం ,బి ఆర్ ఎస్ దోచుకున్న సొమ్మును పేద ప్రజలకు పంచుతాం. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావద్దు.* హామీలు అమలు చేస్తాం. తీపి కబుర్లు తప్ప బిఆర్ఎస్ పై చర్యలు, హామీలు ఏవి!
ఎన్నికలు వస్తున్నాయి అంటే చేపలు ఎదు రెక్కినట్లు నాయకులు ప్రజల దగ్గరికి వచ్చి వంగి వంగి దండాలు పెడతారు . అధికార పార్టీలు ఇందులో ముందు వరుసలో ఉంటాయి . ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీ సమావేశంగా చిత్రీకరిస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ పరిపాలన అంశాలను పక్కనపెట్టి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాలపై బురద జల్లడం నెలల తరబడిగా రివాజ్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్సీపి పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో పాటు నిరంతరం ప్రజలకు డబ్బులు పంచే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమానికి పాల్పడుతూ నాలుగు సంవత్సరాలు గడిచిపోయిన రాజధాని లేని రాష్ట్రంగా అప్పుల కొంపగా మార్చి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దౌర్భాగ్య పరిస్థితులు తాండవిస్తున్నాయి . ఇక కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపించాలని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సర్వ విధాలా ప్రయత్నం చేస్తున్నది . వామపక్షాలు స్వతంత్ర నిర్ణయం తీసుకోలేక కాంగ్రెస్తో చర్చలకు ఎదురుచూస్తున్న అలాంటి అవకాశాలు అంత పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి 30 సెప్టెంబర్ 3 అక్టోబర్ 2023 రెండు రోజులలో మహబూబ్నగర్ నిజామాబాదులో పర్యటించి వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, రైల్వే లైన్లు , రోడ్లు, వంతెనలు వంటి వాటికి ప్రారంభోత్సవం చేయడంతో పాటు నిజామాబాద్ పసుపు బోర్డు గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం చాలా ఆలస్యంగా రాష్ట్ర ప్రజలను ప్రసన్నులను చేసుకోవడానికి చేస్తున్న నటనగా భావించవలసి ఉంటుంది.
ఇందూరు సభలో ప్రధాని ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు:తనపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో బిజెపికి అధికారం కట్టబెట్టాలని, తెలంగాణ తల్లులు చెల్లెమ్మలు ఎన్నికల్లో ఆశీర్వదించి విజయం అందించాలని, బిజెపి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని చేసిన వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన హామీలలో భాగంగా తెలంగాణకు ఇచ్చిన మాటలు 9 ఏళ్లుగా నెరవేర్చక పోవడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ టెక్స్టైల్ పార్కు వంటి ప్రధానమైన హామీలు కేంద్రం ఏనాడో మరిచి మొండి చేయి చూపింది . టెక్స్టైల్ పార్కు నామ మాత్రంగా ప్రస్తావనకు తెచ్చిన అది అంతంత మాత్రమే ఇక గిరిజన విశ్వవిద్యాలయం పసుపు బోర్డు పైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ప్రకటించినప్పటికీ అవి కార్యరూపం దాల్చడానికి ఏళ్లు పడుతుంది అప్పటికి ఉండే ప్రభుత్వాలు ఊహించలేము . ఇక రాష్ట్రంలో పండించినటువంటి వరి పంటను కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ పడ్డప్పుడు కేంద్రం జవాబు చెప్పలేదు. జీఎస్టీ గాని ఇతర పద్దుల కింద రాష్ట్రానికి రావలసినటువంటి వాటా కేంద్రం మంజూరు చేయలేదని, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి జిల్లాకు కళాశాల నిర్మించినదనే ఆరోపణ కేంద్రంపై ఉండనే ఉన్నది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని , అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందని, కాలేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగినట్లుగా జాతీయ బిజెపి అధ్యక్షుడు ప్రధాని కేంద్ర మంత్రుల సమక్షంలో ఆరోపణలు చేసినప్పటికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ అనేక సందర్భాలలో చర్లపల్లి జైలుకు పంపిస్తామని బండి సంజయ్ మొదలు ప్రధాని వరకు ప్రకటించినప్పటికీ పైసా వంతు చర్యలు తీసుకున్న దాఖలా లేదు . ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత దో షిగా ఉన్నట్లు సిబిఐ ప్రకటించినప్పటికీ అరెస్టు చేస్తారనే వార్తలు వినబడ్డప్పటికీ ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్నట్లుగా కనిపించలేదు. అరెస్టు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుండి వినబడుతుంటే కేంద్రం సమాధానం లేదు . బిజెపి, బీఆ ర్ ఎస్ రెండు అంతర్గత ఒప్పందాలు చేసుకున్నాయా అని ప్రజలు ప్రజాస్వామిక వాదులు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ కూటిలో రాయితీ తీ యని వాళ్ళు ఏటిలో రాయితీస్తారా అన్నట్లు టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కుటుంబం దోచిన ప్రజల సొమ్మును రాబట్టి ప్రజలకు పంచుతామని ప్రధానిఈ సభలో చేసిన ప్రసంగం కంటి తుడుపు చర్య మాత్రమే .అంత ధైర్యం కేంద్రానికి ఉంటే ఆ పని ఎప్పుడో అయ్యేది.. కనుక అంత సులభంగా బిజెపిని నమ్మడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు .
రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఆరోపణ లో కొంత వాస్తవం ఉంది :-
***********
మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు జేపీ నడ్డా ప్రధాని వరకు కూడా 1400 మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనగా మారిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఏకస్వామ్యంగా మార్చినారని, అవినీతికి అంతే లేదని , జైల్లో పెడతామని అనేక సందర్భాలలో ప్రకటించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ స్పందించిన దాఖలా లేదు. అంటే వర్గ సంఘర్షణ కొనసాగుతున్నప్పటికీ మా నేరాన్ని రుజువు చేయమని సవాల్ విసిరిన దాఖల రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే అంతర్గత ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యలు వినబడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు కుటుంబ పాలన అవినీతిపైన సామాన్యుల నుండి అసామాన్యుల వరకు స్పష్టమైన అభిప్రాయాన్ని ఎవరు కాదనలేరు. లిక్కర్ స్కా0 తో పాటు ఇతర విషయాల్లో రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి స్వాగతించకపోవడం వంటి చర్యలు జరుగుతున్నప్పటికీ మంత్రి కేటీఆర్ ప్రధానిని ఏక వచన , అన్ పార్లమెంటరీ పదజాలంతో ప్రతిరోజు దూషణ చేస్తున్నప్పటికీ ఎందుకు వీరి పైన చర్య తీసుకోవడం లేదు అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భుజాలు తడుముకున్నట్లు ఉన్నది కదా! వచ్చే ఎన్నికల్లో అధికారానికి వస్తే కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన దర్యాప్తు జరిపించి తగిన శిక్షలు విధిస్తామని అప్పుడప్పుడు బెదిరించడం కూడా నేతి బీరకాయలోని నెయ్యి చందంగానే కనిపిస్తున్నది . అయినప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పైన ప్రధాని చేసినటువంటి ఆరోపణలను అంత సులభంగా కొట్టి పారేయడానికి వీలు లేదు .కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ఆగం కావద్దు:నిజాంబాద్ లో జరిగిన సభలోనే ప్రధాని కాంగ్రెస్ పైన కూడా విమర్శలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రావడానికి మోసపూరిత మాటలు ఆడంబరాలు ప్రలోభాలు వాగ్దానాలు చేస్తున్నారని వారి మాటలు నమ్మి ఓటేసినట్లయితే రాష్ట్ర ప్రజలు ఆగమైపోతారని ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో కూడా అంత బలం లేదు . ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించిన చరిత్ర ఉన్నది. కొన్ని లోపా లు, నేరాలు, కుంభకోణాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి క్రియాశీలక భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ,ఇటీవల తన పందాను మార్చుకొని రాహుల్ గాంధీ భారత్ జో డో యాత్రతో మరింత మేల్కొని కేంద్ర ప్రభుత్వ విధానాల పైన విమర్శనాత్మక దృష్టితో బాణాలు సంధిస్తూ చట్టసభలలో ఓ మేరకు క్రియాశీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని గమనించవచ్చు . కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి దారాదత్తం చేసి, 14 లక్షల కోట్ల రూపాయలను సంపన్న వర్గాలకు మాఫీ చేసి, పెట్టుబడిదారుల పక్షాన పనిచేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు.రాజ్యాంగబద్దసంస్థలను నిర్వీర్యం చేస్తూ మతతత్వాన్ని పెంచిపోశిస్తున్నదనే ఆరోపణ కేంద్రంపై బలంగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కి ఏకపక్ష విధానాలతో అధికారమే పరమావధిగా మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని చట్టసభల సాక్షిగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను లేకుండా చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినారనే ఆరోపణలు గమనిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ప్రారంభించక, కాయలా పడిన పరిశ్రమలను తెరిపించక, మొత్తం ప్రైవేటు రంగానికి అప్పజెప్పి విద్యా వైద్య0 పేద వర్గాలకు దూరం చేసిన క్రమాన్ని మనం చూడవచ్చు. అలాంటప్పుడు ఇటీవల పొందిన అనుభవాలను కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న విధానాలను ప్రస్తావిస్తూ రైతు యువజన విభిన్న వర్గాల బీసీ డిక్లరేషన్ లను ప్రకటించి గత పొరపాట్లను సవరించుకుంటూ పారదర్శకంగా పరిపాలించడానికి సిద్ధపడినట్లు ప్రకటించిన కాంగ్రెస్ క్రమక్రమంగా పుంజుకుంటున్నట్లు స్వయంగా మేధావులు,కొన్నివర్గాలు వెలుబుచ్చుతున్న అభిప్రాయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు . కనుక బిజెపితో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ వైఖరి మోసపూరితమైనదని ప్రధాని చేసిన వాదనలో పసలేదని తేలిపోతున్నది .కాంగ్రెస్ సమకూర్చినటువంటి సుమారు 300 ప్రభుత్వ రంగ సంస్థలను గత 9 ఏళ్లలో బిజెపి పెద్ద మొత్తంలో ప్రైవేటుకు అప్పజెప్పిన విషయాన్ని గమనిస్తే రాష్ట్రాన్ని కూడా బిజెపి అమ్మేస్తుందా అని ప్రజలు వాపోతున్నారు అనుమాన పడుతున్నారు. కనుక ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన ప్రధానమంత్రి సాదాసీదాగా ప్రకటించి గెలిపించమని అభ్యర్థించి కాంగ్రెస్ పైన బురద జ ల్లి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి బారాసపై నామ మాత్రపు చర్యలు తీసుకోవడానికి కూడా జంకుతున్న సందర్భాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని బిజెపి గ్రహించాలి . దర్యాప్తును ముమ్మరం చేసి, నేరాలను రుజువు చేసి, తగిన శిక్షలు విధించి , చంద్రబాబు నాయుడు లాగా నేరస్తులను జైలుకు పంపి తన మాటలను బిజెపి ప్రభుత్వం ప్రధాని రుజువు చేసుకున్నప్పుడు ప్రజలు బిజెపిని ఆదరిస్తారు విశ్వసిస్తారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో బీసీ వర్గాలు నిరాదరణకు గురవుతున్న విషయం తెలిసిందే . బహుజన వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ప్రాలకవర్గాలపై అన్ని రాజకీయ పార్టీల పైన డిమాండ్ చేస్తూ జన గణన లో కుల గణన చేయాలని చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లుకల్పించాలన్న డిమాండ్ కుముందు కేంద్రం స్పందించాలి. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కోట్లాది రూపాయలు నీరుల ఖర్చుపెట్టి ప్రజాధనం వృధా చేస్తున్న నాయకులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది.

 

డాక్టర్ . రక్కిరెడ్డి ఆదిరెడ్డి
పౌర సంబంధాల అధికారి
కాకతీయ విశ్వవిద్యాలయం