ప్రజాస్వామ్యమే ఆమె శ్వాస!..

‘ఆంగ్‌ సాన్‌ సూకీ’ ఈ పేరు వింటే ప్రజాస్వామ్యం పరిమళిస్తుంది. 62ఏళ్ల సూకీ ఈనాటికీ పోరాటమే శ్వాసగా జీవిస్తుంది. ఆమె నుంచి ఎంతో నేర్చుకునేవారే కానీ, నేర్పించేవారు నేడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె పోరాట పటిమకు ప్రపంచమే సలామ్‌ కొట్టింది. అలాంటి అరుదైన పోరాట యోధురాలు నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రానుంది. అనంతపురం జిల్లాలోని పాపసానిపల్లికి రానుంది. బుడి బుడి అడుగులు వేసే రోజుల్లో చేయిపట్టి చేయూతనివ్వాల్సిన కన్నతండ్రి కళ్ళ ముందే కనుమరుగైనా, కష్టాల్లో తోడు, నీడగా ఉండే భర్త భయంకరమైన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ కన్ను మూసినా, కనీసం కడచూపుకు కూడా నోచుకోని పరిస్థితులను ఆమె తనదైన శైలిలో గుండె దిటవు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రాణంగా బ్రతికింది. ఆనాటి బర్మా(మయన్మార్‌) స్వాతంత్యం కోసం తండ్రి చేసిన పోరాటాన్నే ఆమె తన వారసత్వంగా స్వీకరించింది. భర్త వైద్య వృత్తిని వదిలి రాజకీయాలలో అడుగుపెట్టి మంత్రి అవ్వడం, సహజసిద్ధంగా తండ్రి నుంచి వచ్చిన రాజకీయ పోరాటం కలిసి ఆమెను ఒక యోధురాలిగా మార్చాయి. మాతృదేశం సంకేళ్ళను తెంచి స్వాతంత్య్రం అయితే వచ్చింది గానీ అది ప్రజలకు ప్రజాస్వామ్య యుతంగా అందని ఫలం అయిందని ఆవేదన సూకీని మరోస్వేచ్ఛా పోరాటానికి నడుంబిగించేలా చేసింది. సైనికప్రభుత్వ నియంతృత్వంలో కడగండ్ల పాలవుతున్న దేశప్రజల కష్టాలే ఆమెకు పోరాట పాఠాలు నేర్పాయి. అందుకే భారతదేశానికి వచ్చిన ఈ స్ఫూర్తి ప్రదాత తమ దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్‌ సంబంధాలు దూరం కావడం తననెంతో ఆవేదనకు గురి చేసిందని వాపోయింది. 1988లో మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలోకి తన ఇద్దరి కుమారులను స్వచ్ఛందంగా పంపింది. తదనాంతరం నేషనల్‌ లీక్‌ ఆఫ్‌ డెమోక్రసీ పార్టీలో చేరి ప్రజలను ప్రజాస్వామ్య పోరాటానికి మమేకం చేయడం ప్రారంభించింది. ఆ రోజుల్లో సైనిక నియంతృత్వలో చీకటిలో మగ్గుతున్న మయన్మార్‌  ప్రజానీకానికి వెలుగు రేఖ వలే, చుక్కాని వలే భాసిల్లింది. ప్రజానీకం సూకీకి పడుతున్న నీరాజనాలకు గంగవెర్రిలెత్తిన సైనిక ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నింది. కుటుంబం విచ్ఛిన్నం అయితే పోరాటాన్ని వదులుకుంటుందన్న సైనిక ప్రభుత్వం కుయుక్తులు పారలేదు. ప్రభుత్వ నియంతృత్వానికి భర్త, పెద్దకుమారుడు దేశాన్ని వీడి పరాయి దేశంలో తలదాచుకోవాల్సి వచ్చింది. భర్త పెట్టుకున్న క్లీనిక్‌ను, తలదాచుకున్న ఇంటిని సైతం ప్రభుత్వం సీజ్‌ చేసింది. కుటుంబ సభ్యులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయినా సూకీ మాత్రం ప్రజాస్వామ్య పోరాటాన్ని వీడలేదు. జుంటా ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచకాలకు తట్టుకోలేక బర్మా దేశస్థులు పోరుగునే ఉన్న మన దేశంలోకి వచ్చి తలదాచుకునేవారు. అందుకే సూకీ భారత్‌ తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మహాత్ముడు కనుక బతికి ఉంటే తమ దేశస్థుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం తపన పడేవారని, తమ తలరాత ఏనాడో మారేదని వాపోయారు. 1989నుంచి 2010 వరకు గృహ నిర్బంధంలో ఉన్న సూకీ కనీసం పన్నెత్తి పలకరించేవారు కూడా లేక ఎన్నో చీకటి రాత్రులను ధైర్యంగానే గడిపారు. కన్నబిడ్డలు ఏమయ్యారో, ఏ మార్గంలో వెళుతున్నారో ఆయోమయ స్థితిలో విలవిలలాడింది. 2010 తర్వాతనే తన బంధువైన సోదరిని చూడగలిగిందంటే ఆమె ఎలాంటి గృహ నిర్బంధంలో ఉన్నారో అర్థమవుతోంది. ఎన్నో ఏళ్ళగా స్వదేశంలోనూ, విదేశాల్లోనూ వచ్చిన తీవ్ర ఒత్తిడి, పోరాటాలకు తలవొగ్గిన తర్వాత దశాబ్ద కాలం తర్వాత సైనిక ప్రభుత్వం తొలగి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మయన్మార్‌లో జరిగిన ఎన్నికల్లో గట్టిపోటినిచ్చి ఆధిపత్యాన్ని కైవసం చేసుకునే అంకం వరకు వెళ్ళిన సూకీ ఎన్నిక ప్రక్రియలో జరిగిన అవకతవకలు సహజంగానే సూకీని ప్రతిపక్ష నేతకు నెట్టివేశాయి. అయినప్పటికీ ఆధునిక యువతకు స్ఫూర్తి నిస్తూ చలాకీగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్న సూకీని మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటే మీరే గనుక నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే అక్కడి పరిణామాలపై భారతీయులు అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారంటే ఈ ధీరవనిత చేసే పోరాటం ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుందన్న మాట…!