ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైంది ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.  -గద్వాల నడిగడ్డ, ఆగస్టు 22 (జనం సాక్షి);
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించి గౌరవించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
మంగళవారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి సీనియర్ సిటిజన్లకు జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని . ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ,సీనియర్ సిటిజెన్లకు ఎంతో అనుభవం ఉంటుందని, వారి ద్వారా కొంతైనా నేర్చుకోవాలని అన్నారు. ఓటింగ్ లో వారి అనుభవాన్ని ఇతరులకు నేర్పించేలా ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వయోవృద్ధుల అమూల్యమైన సేవలు వల్ల సమాజం అభివృద్ధి చెందిందని వారి సలహాలు సూచనలు పాటించాలన్నారు. ప్రజావాణిలో తరచూ పిల్లలు బాగా చూడడం లేదని దరఖాస్తులు తల్లిదండ్రుల నుండి వస్తున్నాయని, అలా రాకుండా ఉండటానికి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన కలిగి ఉండాలన్నారు.తల్లిదండ్రులను చూడని పక్షంలో వారి ఆస్తిని తిరిగి పిల్లలనుండి ఇప్పించే హక్కు తమకు ఉందని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. నేటి సమాజంలో పిల్లలకు ప్రజాస్వామ్య విలువలు నేర్పించాలని వయోవృద్ధులను కోరారు. వచ్చే ఎన్నికలలో వయోవృద్ధులకు పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈసారి ఎన్నికల్లో 80 సంవత్సరాల పైబడిన వారికి హోమ్ ఓటింగ్ పద్ధతి ప్రవేశపెట్టిందని అన్నారూ. వయోవృద్దులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరు గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తూ, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వి.వి.ప్యాట్ ల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేశారు. ప్రస్తుతం ఓటర్ జాబితా డ్రాఫ్ట్ విడుదలైనందున వయోవృద్ధుల ఓట్లు చెక్ చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పలువురు సీనియర్ సిటిజన్ లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రామన్ గౌడ్, బసవరాజ్ , గోవిందమ్మ మాట్లాడారు. గోవిందమ్మ తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుండి ప్రతి ఎన్నికలో ఓటు వినియోగించుకున్నానని తెలిపారు. నిజాయితీగా ఉండేవారు నిజాయితీగా ఉండే అభ్యర్థులను ఎన్నుకోవాలన్నారు.
అనంతరం సీనియర్ సిటిజనులను జిల్లా కలెక్టర్ శాలువా, మొమెంటులతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చీర్ల శ్రీనివాస్, అపుర్వ్ చౌహాన్, జెడ్పి సీఈవో ముసాయిదా బేగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.