ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకం,ఓటు వేయడం బాధ్యతగా భావించాలి- డిఆర్ఓ నగేష్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్టు 24 ::::
ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి నగేష్ అన్నారు.
స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వయోవృద్దులకు
ఓటరు అవగాహన సదస్సు( సెమినార్/సింపోజియం) నిర్వహించారు.
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైనదని, ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అనేక మార్పులు చేపడుతూ, వివిధ రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తికీ ఓటు వేసే అవకాశము ఉందన్నారు. సెప్టెంబర్ 19 వరకు మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని,అన్ని
పోలింగ్ కేంద్రాలలో ముసయిదా ఓటరు జాబితాలు అందుబాటులో ఉన్నాయని,తమ పేరు జాబితాలో పరిశీలించుకోవాలని సూచించారు.
అపార అనుభవం గల వయోవృద్దులు తమ చుట్టుపక్కల గల యువతకు ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించి,ఓటరుగా నమోదయ్యేలా చైతన్య పరచాలని కోరారు.
ఓటు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని,
ఓటును మించిన ఆయుధం లేదని,
దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భారత ఎన్నికల సంఘం ఎనభై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు, దివ్యంగులు తమ ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించిందని వివరించారు. వయోవృద్ధులు ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని కోరారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్, వీల్ చైర్, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలను నివృత్తి చేసారు. ఈవీఎం, వివి ప్యాట్ ల డెమో చేసారు. ఓటింగ్ చేయడం, వేసిన ఓటును చెక్ చేసుకోవడం పై మాక్ పోలింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పలువురు వయోవృద్ధులు పలు , సలహాలు,సూచనలు చేశారు.
అనంతరం వయోవృద్దులకు సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, నారాయణఖేడ్ ఆర్డిఓ వెంకటేష్, కలెక్టరేట్ ఏఓ పరమేశ్వర్, వయోవృద్దులు, తదితరులు పాల్గొన్నారు.