ప్రజా తెలంగాణ సాధిస్తేనే జయశంకర్‌ సార్‌కు నివాళి

3

– ప్రొఫెసర్‌ కోదండరాం

హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి): ప్రజా తెలంగాణ సాధించడమే  ఫ్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌కు అసలైన నివాళి అని ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడం ఓ ఎత్తు అయితే…. రాష్ట్రాభివృద్ధి సాధించడం మరో ఎత్తు అని జేఏసీ ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం తెలిపారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు లబ్ధి చేకూర్చే తెలంగాణ వద్దని ప్రభుత్వ నేతలకు సూచించారు. ప్రభుత్వం అంటే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో టి.జేఏసీ కార్యాలయంలో ప్రొ. కె.జయశంకర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొ.కె.జయశంకర్‌ చిత్రపటానికి ప్రొ.కోదండరాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధి కోసం మరింత సంఘటితంగా ప్రయత్నించాలని దివంగత .జయశంకర్‌ సార్‌ చెప్పారని ఈ సందర్భంగా కోదండరాం గుర్తు చేశారు. ఆయన బాటలోనే పయనిద్దామని తెలంగాణ ప్రజలకు కోదండరాం పిలుపునిచ్చారు.  అలాగే ఏ అంశంపైన అయినా తాము తొందరపడి మాట్లాడమని… అధ్యయనం చేశాకే ఏ విషయంపైన అయినా స్పందిస్తామని చెప్పారు. మసుషులు ఎవరూ శాశ్వతం కాదని… వారి ఆలోచనలే ఎప్పటికీ నిలిచి ఉంటాయని కోదండరాం పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామాకాలు ఇవే తెలంగాణ ఉద్యమ ఎజెండా. దీని చుట్టూతనే ఉద్యమం అల్లుకున్నది. విడతలు విడతలుగా పాయలు పాయలుగా సాగింది . 60 ఏళ్ల ఉద్యమం ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నది.  చివరకు  గమ్యాన్ని ముద్దాడింది. నిటారుగా నిలిచేందుకు బలమైన సైద్ధాంతిక పునాది ఏర్పాటుచేసుకున్నదని గుర్తు చేశారు.   జెండాలు వేరైనా అందరి ఎజెండా ఒకటే అయింది. తొలి విడత నుంచి మలి విడత ఉద్యమ కాలానికి వచ్చే సరికల్లా గుణాత్మకమైన మార్పు ఉద్యమంలోనూ, ఉద్యమకారుల్లోనూ వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో క్రియాశీలంగా ఉన్న ఏకైక వ్యక్తి  ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ అని అన్నారు.  1952లో వచ్చిన ఇడ్లీ సాంబర్‌ గో బ్యాక్‌ నుంచి 1969 తెలంగాణ ఉద్యమం  వరకు,  1996 నుంచి 2011 లో తాను కన్ను మూసే వరకు ఆయన ఉద్యమాన్ని శ్వాసించిన మహానుభావుడాయన అని అన్నారు.  దానికో సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేశారు. దాని ఆధారంగానే ఉద్యమం ముందుకు సాగింది. కలవని, కలవ లేరు అనుకున్న పార్టీలు, నాయకులు కలిసేలా చేసింది. యావత్‌ తెలంగాణనే ఓ జెండా కిందకు వచ్చిన ఘనత సార్‌దని అన్నారు.  ఇంతటి ఏకీకరణ వెనుక జయశంకర్‌ జీవిత కాల కృషి, పట్టుదల దాగి ఉందన్నారు. తొలి సారి కంటే తాను ప్రజలను ఏకీకృతం చేస్తున్న క్రమంలోనే ఉద్యమ సిద్ధాంతాన్ని ఆచరణలోకి  తీసుకొచ్చారు జయశంకర్‌. తెలంగాణ రాష్ట్రంలో

ఉన్న నిధులు, ఇక్కడి వనరులు,  ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులు,  జరిగిన నియామాకాలు అన్నీ లెక్కలతో సహా జయశంకర్‌ చూపించారు.  స్వరాష్ట్రం సాధించుకోవాలనే ఆకాంక్షను జనంలోకి బలంగా తీసుకెళ్లిన ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని కోదండరామ్‌ అన్నారు. ఆ మేరకు మనమంతా ఇప్పుడు అందుకు అనుగుణంగా సాగాలని, ఆకాంక్షలు నెరవేర్చుకోగలగాలని, అప్పుడే జయశంకర్‌ సార్‌కు ఘనమైన నివాళి అన్నారు.