ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేని కేంద్రం

సమస్యలపై చర్చకు ముందుకు రాని ప్రభుత్వం
నిరంకుశ ధోరణులతో విపక్షాలపై సస్సెన్షన్‌ వేటు
ప్రజాస్వామ్యంలో విపరీత పోకడలు సరికాదు

న్యూఢల్లీి,జూలై27(ఆర్‌ఎన్‌ఎ): ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల, గ్యాస్‌ ధరలను మార్కెట్‌ ధరలకే కొంటున్నాం. ధరల విపరీత పెరుగుదలతో సామాన్యుల జీవనం భారంగా మారిన స్థితిలో బియ్యం, పప్పు, పాలు వంటి ఆహారపదార్థాలను కూడా వదలకుండా పాలకులు జీఎస్టీ బాదేస్తున్నారు. కొత్త ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, ఉన్నవాటిని పైమెట్టు ఎక్కించి ఎక్కువ పన్నువేయడం వంటి విన్యాసాలు జరుగుతున్నాయి. ఎర్రని గ్యాస్‌ సిలండర్‌ విూద పాలకులకు ఎప్పుడూ మంటే. పొరుగున ఉన్న లంకను ఆదుకోవడం ఎంత ముఖ్యమో, మన ఆర్థికస్థితినీ, ముంచుకొస్తున్నముప్పునూ కచ్చితంగా అంచనా వేసుకొని జాగ్రత్తపడటం అంతకంటే ముఖ్యం. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతోంది. దేశం అప్పులు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. అయినా పురోగమించడం
లేదు. సమస్యలను పార్లమెంటులో చర్చించడం లేదు. వారంరోజులు దాటినా పార్లమెంటులో ఒక్క అంశం కూడా చర్చకు రాలేదు. చరిత్రలో ఎన్నడూలేనంత కనిష్ఠస్థాయికి రూపాయి మారక విలువ పడిపోయింది. డాలరు ధాటిని తట్టుకోలేక రూపాయి గిలగగిల కొట్టుకుంటోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల కరెన్సీలు కుప్పకూలి పోయాయనీ సమర్థించుకుంటున్నారు. రూపాయి విలువ పతనానికి వెలుపలి ప్రభావాలతో పాటు, మన ఆర్థికవ్యవస్థ బలహీనత, కట్టుతప్పిన ద్రవ్యోల్బణం వంటి అంతర్గత కారణాలూ ఉంటాయి. ఎగుమతులు తగ్గడం, విదేశీపెట్టుబడులు తరలిపోవడం, కరెంట్‌ ఎకౌంట్‌ లోటు జీడీపీలో మూడుశాతానికి చేరుకోవడం వంటివి ప్రమాద సంకేతాలు. కీలకమైన ఆర్థిక సూచికలన్నింటా భారత్‌ బలహీనంగానే ఉన్నది. ద్రవ్యోల్బణం ఎనిమిది శాతానికి చేరడం, వృద్ధిరేటు పెరగకపోవడం, ఎగుమతు లకంటే దిగుమతులు హెచ్చడం వంటివి గమనించుకోవాలి. ఈ సమస్యలపై చర్చించాల్సిన ప్రభుత్వం విపక్షాలను సభనుంచి గెంటేయడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే ఏదో రకంగా చర్చించాలి. ఇది ప్రజల కోసమే తప్ప విపక్షాల కోసం కాదని గుర్తించాలి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై వారం రోజులు దాటినా ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్‌ సరిగ్గా సాగలేదు. పార్లమెంట్‌లోకి తొలిసారిగా అడుగు పెట్టిన కొన్ని పార్టీల ఎంపీలు సభ అంటే ఏమిటో తెలుసుకోకుండానే మొదటి రోజు నుంచే వెల్‌లోకి దూసుకువచ్చి సస్పెన్షన్‌కు గురవుతున్నారు. సభలో అన్నిటికంటే ముందుగా దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్‌, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చించి జవాబి వ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న వాయిదా తీర్మానాలను సభాపతులు బుట్టదాఖలు చేస్తున్నారు. కనీసం సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో కూడా కీలక అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం మన స్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని ప్రధాని మోడీ సహా మంత్రులు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే సభలు సమావేశమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరాల్లో రాజకీయ సుహృద్భావ వాతావరణం కనిపించింది. కానీ రానురాను అలాంటి సందర్భం లేకుండా పోతోంది. సమర్థుడైన పార్లమెంటరీ వ్యవహారా శాఖ మంత్రి లేకపోవడం కూడా ఓ లోపంగా చూడాలి. క్రమంగా ప్రతిపక్షాలకూ, ప్రభుత్వానికీ మధ్య ఘర్షణ వాతావరణం పెరగడమే కానీ, తగ్గిన దాఖలాలు కనపడలేదు. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సంఘర్షణ మరింత పెరుగు తూ వస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫలానా బిల్లును ఫలానారోజు ఆమోదించాల్సిందేనని సభాపతులకు చెప్పడం తప్ప ఏవిూ చేయలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఎంతటి తీవ్రమైన సమస్యను లేవనెత్తినా వారికి జవాబివ్వనవసరం లేదనే ధోరణిలో ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షాలన్నా, వారి నిరసనలన్నా ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని అర్థమవుతోంది. అసలు వారితో చర్చించడమే అనవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ధరల పెరుగుదల, జిఎస్టీ,అగ్నిపథ్‌ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోతోంది. దేశంలో అసాధారణమైన రీతిలో ద్రవ్యోల్బణం కొనసా గుతోంది. నిత్యావసర వస్తువుల దిగుమతి వ్యయం తీవ్రంగా పెరిగింది. పెట్రోలు, డీజిల్‌, గ్యాసు, వంట నూనెల ధరలే కాక, ప్రతి నిత్యావసర వస్తువు ధరా ఆకాశానికి అంటింది. పైపెచ్చు ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ వడ్డింపులు పెరిగాయి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వమని ప్రతిపక్షాలు కోరితే కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్‌ కొవిడ్‌తో బాధపడుతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విచిత్రమైన సమాధానం చెప్పి తప్పించుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాలతో పాటు పార్లమెంటరీ సంప్రదాయాలు గంగలో కలుస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వా మ్యానికి గొడ్డలిపెట్టు కాక మరోటి కాదు. నియంతృత్వ ధోరణులతో పాలన చేయలేమని పాలకులు గుర్తించాలి.