ప్రణయ్‌ హత్యపై..  హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి


– ప్రణయ్‌ విగ్రహం నెలకొల్పేందుకు కేటీఆర్‌ అనుమతివ్వాలి
– ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాజకీయ, ఆర్థిక అండదండలతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి ఉందన్నారు. నిందితులకు శిక్ష పడాలని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ కోరారు. నిందితులకు నిజంగా శిక్ష పడాలనే ఆలోచన ఉంటే.. ట్విటర్‌ ద్వారా స్పందించండం కాదని, ముందు టీఆరెఎస్‌ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. మారుతిరావు అన్ని పార్టీలను గుప్పిట్లో పెట్టుకున్నాడని విమర్శించారు. ప్రణయ్‌, అమృతలకు ప్రమాదం ఉందని తెలిసినా పోలీసులు కాపాడేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.  మారుతిరావు సెటిల్మెంట్లతో అక్రమాస్తులు కూడగట్టుకున్నాడని అందరికీ తెలుసనని, అధికారుల అండదండలు చూసుకునే హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. హత్యకు గంట ముందు మారుతి రావు వేములపల్లి కట్టవిూద డీఎస్పీతో పదిహేను నిమిషాలు మాట్లాడాడని అన్నారు. ఈ హత్యకు సంబంధించి అందరికి శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కేటీఆర్‌ స్పష్టమైన వైఖరిని తెలిపాలని కోరారు. అదేవిధంగా మిర్యాలగూడ పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌ విగ్రహాన్ని నెలకొల్పడానికి కేటీఆర్‌ అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18 నుంచి 24 వరకు గ్రామ మండల స్థాయిలో ఉదయం నిరసనలు, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

తాజావార్తలు