ప్రతిపక్ష పార్టీలు పీపుల్స్ లెస్ పార్టీలు.

పదవుల కోసం,డబ్బులకోసం రాజకీయాల్లోకి రాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు మిగిల్చారు.
కూల్చడం కాంగ్రెస్ నైజం కట్టడం బిఆర్ఎస్ నైజం.
రెండేళ్లలో సాగునీటితో పంట పొలాలు సస్యశ్యామలం చేశా.
నా రాజకీయ జీవితం నియోజకవర్గానికే అంకితం.

– ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజాబలం లేని పీపుల్స్ లెస్ పార్టీలు అని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులపై విరుచుకుపడ్డారు.తెల్కపల్లి మండలంలో చేపట్టిన పదేళ్ల ప్రజాప్రస్థానం పాదయాత్ర లో భాగంగా శుక్రవారం తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో ఎంపిటిసి నారాయణమ్మ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో రైతులకు హామీ ఇచ్చిన మేరకు కే ఎల్ ఐ కాలువల ద్వారా సాగునీరు ఇచ్చి పంట పొలాలను సస్యశ్యామలం చేశానని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని,ప్రతిచోటా సమస్యలు సహజం అని నిరంతరం సమస్యల పరిష్కారానికి పని చేస్తూనే ఉండటం నాయకుడి ధర్మం అని అన్నారు.ప్రజా ప్రస్థానంలో పాదయాత్ర ద్వారా ఏ గ్రామానికి వెళ్లినా ఇండ్లు, పెన్షన్ లు మాత్రమే అడుగుతున్నారని నీళ్లు, కరెంటు అడగడం లేదని ఆయన అన్నారు. అప్పుడు ప్రజలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికే వారని ఇప్పుడు ఆనందంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.నియోజక వర్గంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చారే తప్ప సాగునీరు తాగు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు.మంచిపని చేస్తుంటే కొందరు అడ్డుపడటం సహజం కానీ మెజారిటీ ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజి, మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.తాను రాజకీయాలకు
డబ్బు, పదవి కోసం రాలేదని చేతనైనంత ప్రజాసేవ చేయడానికి వచ్చానని అన్నారు. నెల రోజుల్లో వట్టెం రిజర్వాయర్ ప్రారంభం అవుతుందని రిజర్వాయర్ వల్ల 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.గతంలో ఈ ప్రాంతంలోని భూములు నీళ్లు లేక నెర్రెలు ఇచ్చుకునేవని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుల కాలువల వల్ల భూగర్భ జలాలు పెరిగి నీళ్లు భూమిలో నుంచి ఉబికి వస్తున్నాయని అన్నారు. రాత్రిపూట పొలాల వద్ద రైతులు కాపలా ఉండే పరిస్థితులు పోయాయని అన్నారు. ఈ పదేళ్లలో పాదయాత్ర ద్వారా తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాని తెలిపారు.ఇంకా ప్రజల నుంచి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నానుని అన్నారు.పోల్చడం కాంగ్రెస్ నైజం అని కట్టడం బిఆర్ఎస్ నైజం అని అన్నారు.నియోజకవర్గానికి గృహలక్ష్మి పథకం కింద 3 వేల ఇండ్లు మంజూరు అయ్యాయని ప్రతి గ్రామానికి 20 నుండి 25 ఇండ్లు వచ్చేలా చూస్తానని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి నా నియోజకవర్గానికి వచ్చినన్ని నిధులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి కూడా రాలేదని ఒకవేళ ఏ నియోజకవర్గానికైనా ఎక్కువ నిధులు వచ్చాయని నిరూపిస్తే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.నేను చేపట్టిన పాదయాత్రను తప్పుదోవ పట్టించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని,ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలకు సేవ చేయడమే నా రాజకీయ లక్ష్యం అన్నారు. నా రాజకీయ జీవితమంతా నా నియోజకవర్గ ప్రజలకే అంకితమని అన్నారు.ఈ సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ గంగనమోని కిరణ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ నారాయణమ్మ,ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు మంగి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు