ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు

– సమన్వయలోపంతోనే తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటనలు
– సీఎంతో భేటీలో రాజకీయ ప్రసక్తే లేదు
– విలేకరుల సమావేశంలో మాజీ డీజీపీ సాంబశివరావు
అమరావతి, ఆగస్టు28(జ‌నం సాక్షి) : తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని మాజీ డీజీపీ సాంబశివరావు తేల్చిచెప్పారు. నామినేటెడ్‌ పదవులపై ఇప్పటికైతే ఆలోచన చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో మంగళవారం మాజీ  డీజీపీ కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇటీవల విశాఖలో ప్రతిపక్ష నేత జగన్‌ను సాంబశివరావు కలవడం, ఆయన వైకాపాలో చేరుతున్నారంటూ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి ప్రకటించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సాంబశివరావు స్పందిస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసేంత శక్తి తనకు లేదని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను విశాఖ సీపీగా తాను ఉన్నానని తెలిపారు. అప్పుడు కూడా మర్యాదపూర్వకంగా కలిశానని గుర్తుచేశారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవోగా ఉన్నందున అక్కడకు సవిూపంగా జగన్‌ వచ్చినందునే మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు. సమన్వయలోపం కారణంగానే తాను వైకాపాలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించి ఉండవచ్చని సాంబశివరావు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంతో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన రాలేదని సాంబశివరావు తెలిపారు. గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం అభివృద్ధిపై సలహాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

తాజావార్తలు