ప్రత్యేకాధికారులపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం, జూలై 20 : ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రామ సందర్శనలో ప్రత్యేకాధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశం నిర్వహించి పారిశుధ్యం, విద్యాహక్కుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య అన్నారు. నెలకోసారి పారిశుధ్యం, సాక్షరభారత్, ఉపాధి, గ్రామ సందర్శన, ఇందిరమ్మబాట, మీసేవ, ఓటర్ల సవరణ వంటి అంశాలపై ఏర్పాటు కానున్న సమావేశానికి ప్రత్యేకాధికారులు గైర్హాజరుకావడంతో కలెక్టర్ మండిపడ్డారు. జెడ్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం పక్కాగా అమలు జరిగేలా పిల్లలకు అవగాహన కల్పిస్తే వారి చుట్టూ ఉన్న బడిబయట పిల్లల్ని పాఠశాలల్లో చేర్పిస్తారని, సమాచారాన్నైనా అందిస్తారని చెప్పారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నందున కరువు ఛాయలు కనిపిస్తున్నాయని, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు తాగునీటి కష్టాలు కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆగస్టు 26న జరగనున్న సాక్షర భారత్ పరీక్షకు జిల్లా నుంచి లక్ష 31వేల మంది హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో దొర్లిన తప్పిదాలు జరగకుంఆ చూడాలన్నారు. అదే విధంగా గడిచిన గడిచిన రెండేళ్ళకాలంలో బాలకార్మికులకు సంబంధించి ఒక్క కేసైనా నమోదు చేశారా! అని నిలదీసి, బాలకార్మికులు లేకుండా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి శ్రీరాములనాయుడు, జిల్లా పరిషత్ సీఈవో మోహనరావు, డిఆర్‌ఒ హేమ సుందర వెంకటరావు, విజయనగరం ఆర్డీవో రాజకుమారి, పార్వతీపురం ఆర్డీవో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.