ప్రధాని దురహంకారి
– ఈశాన్య రాష్ట్రా ముఖ్యమంత్రులతో సంప్రదించలేదు
– నాగా ఒప్పందంపై సొనియా ఫైర్
– మూడో రోజు కొనసాగిన ఆందోళనలు
న్యూఢిల్లీ,ఆగస్ట్6(జనంసాక్షి):
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. నాగా శాంతి ఒప్పందం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. కేవలం మోడీ తన అహంకారంతో ఏకపక్షంగా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎవరిని సంప్రదించకుండా ఇలా ఒప్పందం చేసుకుంటే వారు ఎలా ఒప్పుకుంటారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, గుజరాత్, మధ్యప్రదేశ్ సిఎంలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌లు రాజీనామా చేయడమో లేదా వారిని తొలగించడమో చేసే వరకు తమ ఆందోళన విరిమంచేది లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రకటించారు. వీరిపై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకోవాల్సింది పోయి వారిని ప్రధాని మోడీ వెనకేసుకుని రావడం దారుణమని అన్నారు. వీరిపై చర్య తీసఉకునే విషయంలో తయమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆపార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మూడో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి, సీఎంలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గొంతును నొక్కేస్తున్నారని విమర్శించారు. నాగా శాంతి ఒప్పందంలో ఈశాన్య రాష్ట్రాలఅభిప్రాయాలు తీసుకోలేదని, అక్కడి ప్రజలను అవమానపరిచారని విమర్శించారు. పార్లమెంట్ లో సైతం తమ వాణిని నొక్కేస్తున్నారని విమర్శించారు. కాగా వారికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది.