ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలని మార్చాలి

– ఇంగ్లీష్‌ విూడియం విద్యతోనే అది సాధ్యమవుతుంది
– వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-6తరగతి వరకు ఇంగ్లీష్‌లోనే బోధన
– ప్రతి స్కూల్‌లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం
– ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చి సన్నద్ధం చేస్తాం
– కొందరు పెద్ద మనుషులు నన్ను టార్గెట్‌ చేస్తున్నారు
– పేద పిల్లలు నైపుణ్యం లేనివారిగా మిగిలిపోవాలనే వారి ఉద్దేశమా?
– ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి
ఒంగోలు, నవంబర్‌14 (జనంసాక్షి)  : నేటి ప్రపంచంలో మన విద్యార్థులు ఉన్నతులుగా రాణించాలంటే వారికి తప్పనిసరిగా ఇంగ్లీష్‌ వచ్చి ఉండాలని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియం బోధన చేయడం ద్వారా వారు ఎక్కడైనా ఉన్నతులుగా రాణించే సత్తాను కలిగి ఉంటారని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ‘ మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పిల్లలు భావితరంతో పోటీ పడాలంటే మార్పు తేవాల్సిందే అన్నారు. మన పిల్లలు ఇంగ్లీష్‌ లో మాట్లాడలేకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. తెలుగు విూడియంలోనే చదివితే పిల్లల తలరాతలు మారవని సీఎం స్పష్టం చేశారు. ఎవరూ చదివించని గవర్నమెంటు బడులను అలాగే వదిలేయాలా అని సీఎం జగన్‌ నిలదీశారు. ఈ తరం పిల్లలను ఎక్కడైనా బతికేలా తీర్చిదిద్దాలన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే పేద పిల్లలు నైపుణ్యం లేని వారిగానే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం అన్న సీఎం జగన్‌.. నాడు-నేడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మూడు దశల్లో మనబడి నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో 15వేల 715 స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. 2020 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూల్స్‌ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ విూడియంలోనే బోధన ఉంటుందన్నారు. రాష్ట్రంలో 45వేల ప్రభుత్వ స్కూల్స్‌ ఉన్నాయని చెప్పారు. ప్రతి స్కూల్‌ లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌ లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌ లో పని చేసే టీచర్లకు కూడా ఇంగ్లీష్‌ ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. రాష్ట్రంలో 33 శాతం మంది పిల్లలు చదువురాని వారున్నారని జగన్‌ చెప్పారు. ఇప్పటికే ఎక్కడ చూసినా అంతర్జాలమే కనిపిస్తోందని, మరో 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోనుందని చెప్పారు. పదేళ్ల తర్వాత ప్రతి రంగంలోనూ రోబోటిక్స్‌ కీలకం కానున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల చదువులు లేకపోతే వాళ్ల భవిష్యత్తు ఏంటి అని ప్రశ్నించారు. పేదల తలరాత మార్చాల్సిన అవసరం మనకు లేదా? అని సీఎం అన్నారు. కార్పొరేట్‌ చదువులకు కొమ్ముకాయడం సమంజసమా? అని ప్రతిపక్షాలను విమర్శించారు.  ప్రపంచంతో పోటీపడేలా మన పిల్లలను మార్చాలని, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా అంటూ జగన్‌ ప్రశ్నించారు. మన పిల్లలకు ఆంగ్ల చదవులు రాకపోతే వాళ్ల పరిస్థితేమిటి..? మన పిల్లలు నైపుణ్యం లేని పనివారిగానే మిగిలిపోవాలా అని జగన్‌ అన్నారు. ఖచ్చితంగా ఇంగ్లీష్‌ విూడియాన్ని అమలు చేసి తీరుతామని, పేద విద్యార్థుల భవిష్యత్‌ను బంగారంగా తీర్చిదిద్దుతామని జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.