ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మనోభావాలను అమెరికా గాయపరుస్తోంది

 

శ్రీఇది సాంస్కృతిక , సామ్రాజ్యవాద దాడిలో భాగమే..

శ్రీమావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ

హైదరాబాద్‌, నవంబర్‌30 (జనంసాక్షి) :

ముస్లింల మనోభావాలను అమెరికా గాయపరుస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పత్రికా కార్యాలయానికి ఆయన శుక్రవారం లేఖ పంపారు. ముస్లిం వ్యతిరేక, ప్రతిఘాతుక క్రిస్టియన్‌ మత దురహంకారుల బృందం తీసిన ‘ఇన్నోసెన్స్‌ ఆఫ్‌ ముస్లిమ్స్‌’ అనే విడియో సినిమాని ఇంటర్నెట్‌లో అందుబాటులో వుంచడం సరికాదన్నారు. ఇది మహమ్మద్‌ ప్రవక్తను అవమానించడమేనన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ లిబియా, ట్యునీసియా, థాయ్‌లాండ్‌, ఇండొనోసియా, పాకిస్థాన్‌ అఫ్ఘనిస్తాన్‌ ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, అరబ్‌దేశాలు, భారత్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విశయాన్ని గుర్తు చేశారు. అమెరికా దుశ్చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ సాంస్కృతిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అమెరికా ప్రభుత్వమూ, సినిమాని తీసినవారూ ప్రపంచవ్యాప్తంగా గల ముస్లింలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

9/11 దాడి జరిగిన్పటి నుంచి అమెరికా సామ్రాజ్యవాదం ‘టెర్రరిజంపై యుద్ధం’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను మరింతగా దాడికి లక్ష్యాలుగా చేసుకుంటూ వస్తోందన్నారు. ఈ దాడి కేవలం రాజకీయ, మిలటరీ, ఆర్థిక రంగాల్లోనే కాక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కూడా కొనసాగుతోందన్నారు. అమెరికా, దాని మిత్రదేశాల ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాద దాడిరూపాల్లో పచ్చి క్రిస్టియన్‌ మత దురహంకార వ్యక్తీకరణలు, అబూ గ్రాయిబ్‌లో జరిగిన దారుణమైన చిత్రహింసల నుంచి మొదలుకొని, మహమ్మద్‌ ప్రవక్తను, ఖురాన్‌ను, యితర ఇస్లాం మత సంకేతాలను కార్టూన్‌లలో, సినిమాలలో వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో అవమానించడం వరకు వున్నాయన్నారు. ఈ సాంస్కృతిక దాడి ముస్లింల మానసికతను దెబ్బతీసి, తాము తక్కువవారమని భావించేలా చేయడానికి, తద్వారా ‘టెర్రరిజం మీద యుద్ధం’ పేరిట తమపై జరుగుతున్న అత్యాచారాలనూ, సామ్రాజ్యవాద దురాక్రమణలనూ ప్రతిఘటించకుండా వుండడానికి ఉద్దేశపూర్వకంగా పథక రచన చేస్తోందని పేర్కొన్నారు. ముస్లిం ప్రజానీకాన్ని దెబ్బ తీయడానికి ఉద్ధేశించిన ప్రతి అవమానం తిరిగి ఒక బ్రహ్మాండమైన నిరసనగా ఎగిసి వారి ముఖంపై పిడిగుద్దుగా మారుతోందని తెలిపారు. ఇందునుగుణంగానే ఈ సినిమా ఒక సాంస్కృతిక అంశంపై ప్రపంచం మునుపెన్నడూ ఎరుగని స్థాయి నిరసనలకు దారితీసిందన్నారు. ఈ నిరసన రూపాల్లో బ్రహ్మాండమైన ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు, అమెరికా జెండా, ఆస్తులు, ఇతర అమెరికా సంకేతాల దగ్ధం, విధ్వంసం నుంచి మొదలుకొని అమెరికా దౌత్య కార్యాలయాల మీద దాడులు, వారి దౌత్యవేత్తల హత్యల దాకా ఉన్నాయని పేర్కొన్నారు. అపూర్వ స్థాయిలో వెల్లువెత్తుతున్న ఈ ఆగ్రహం కేవలం మహమ్మద్‌ ప్రవక్తను అవమానపరచడానికి వ్యతిరేకంగా మాత్రమే కాదనీ, అమెరికా సామ్రాజ్యవాదులు ముస్లిం ప్రజానీకం మీద, ఇరాక్‌, అఫ్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌లో కొనసాగించిన అన్ని రకాల అత్యాచారాలకూ, జియోనిస్టు, ఇజ్రాయిల్‌, పాలస్తీనా ప్రజల మీద కొనసాగిస్తున్న అత్యాచారాలకు అది నిస్సిగ్గుగా అందిస్తున్న మద్దతుకీ వ్యతిరేకంగా వారిలో ఎన్నాళ్ల నుంచో రగులుతున్న ద్వేషంలో కూడా భాగమనీ మనం అర్థం చేసుకోవాలన్నారు. ఈ నిరసనలను ఒక మత సమూహం కేవలం ఒక మత సంబంధమైన విషయంలో చేస్తున్న నిసరనలుగా మాత్రమే కాక ఒక విశాలమైన అర్థంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సంస్కృతి సహా అన్ని రంగాల్లో చేస్తున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో భాగంగా చూడాల్సి ఉంటుందన్నారు. అమెరికా, నాటో బలగాలు గల్ఫ్‌ ప్రాంతంలోని దేశాలను ఆక్రమించి, అక్కడి చమురు నిల్వలను దోచుకోవడానికి చేసిన దురాక్రమణ యుద్ధాలు, సమృద్ధమైన వనరులు గల అరబ్‌, ఉత్తర ఆఫ్రికా దేశాలపై చేస్తున్న నయా వలసవాద దోపిడీ, లూటీ అనేవి అమెరికా పట్ల వ్యక్తమవుతున్న ఈ ద్వేషం వెనుక గల ముఖ్య కారణమని తెలిపారు. ఈ దేశాల్లోని అత్యధిక మెజారిటీ జనాభా అయిన ముస్లిం ప్రజల ప్రతిఘటనను దెబ్బ తీయడానికి అమెరికా కుట్రపూరితంగా, ఉద్ధేశపూర్వకంగా చేస్తున్న ఇస్లాం వ్యతిరేక ప్రచారం, చర్యల వల్లనే ప్రధానంగా ఇది మతపరంగా మారిందన్నారు.

ఈ నిరసనలు వెల్లువెత్తుతున్న దేశాల్లో అధికారంలో వున్న దళారీ పాలకవర్గాలు, తమ అసలు స్వభావానికి అనుగుణంగానే తూటాలు, టియర్‌ గ్యాస్‌, లాఠీ చార్జీలు, అరెస్టులతో నిరసనకారుల్ని అణచివేయ ప్రయత్నిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఈ పాలకవర్గాలు ఒకవైపు సామ్రాజ్యవాదులకు పెంపుడు కుక్కల్లాగానూ, మరోవైపు తమ స్వంత ప్రజలపై కరడు గట్టిన నిరంకుశులుగా వ్యవహరిస్తూ వస్తున్నారని తెలిపారు. ఒకవైపు అమెరికా డ్రోన్‌ విమానాలు అఫ్ఘన్‌ గ్రామాలపై ఎడతెరిపిలేని దాడులు చేస్తూ రోజువారీ కార్యక్రమంలో అక్కడి అమాయక ప్రజలను చంపుతూ వుంటే, ముస్లిం ప్రపంచం ఒక్కటై ఈ సినిమా రూపంలో జరిగిన అమెరికా సాంస్కృతిక దాడికి నిరసనగా పైకి ఎగుస్తూ వుంటే కర్జయ్‌ మాత్రం ‘టెర్రరిజంపై యుద్ధం’ కొనసాగాల్సిందేననీ అయితే అఫ్ఘన్‌ గ్రామాల్లో మాత్రం దీన్ని కొనసాంగచవద్దని ఒబామాని బతిమాలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కీలుబొమ్మలు కూడా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులు ముస్లిం మీద అసంభ్యాకంగా జరుగుతున్న దాడులకు అంతే బాధ్యులవుతారని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక దాడులు జరిగినప్పుడు వీరు ఎన్నడూ ముస్లిం ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలిగెత్తి చాటారని కొనియాడారు. ప్రజలే ఇటువంటి కుమ్మక్కుదారుల అసలు ముఖాన్ని ఎండగట్టాల్సి ఉంటుందని తెలిపారు.

నిరసనల స్థాయిని చూసి నిర్ఘాంతపోయిన అమెరికా ప్రభుత్వం మహా ఆలస్యంగా 70,000 డాలర్లకు పైగా సొమ్మును ప్రకటనల మీద ఖర్చు చేసింది. వీటిలో ఒబామా, హిల్లరీ క్లింటన్‌ అమెరికా ఎల్లప్పుడూ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వచ్చిందని సందేశాలు ఇస్తూ నిరసన వెల్లువను ఆపడానికి విఫలయత్నాలు చేశారు. మొదటగా అసలు ఈ సినిమా కేవలం ఎవరో ఒక మనిషి తన ఊహలు, భావాల వల్ల తీసింది. అమెరికా ప్రభుత్వమూ, దాని మిత్ర దేశాలూ బహిరంగంగానూ, రహస్యంగానూ ‘టెర్రరిజం యుద్ధం’లో భాగంగా ప్రాయోజితం చేసి, మద్ధతునిచ్చి, ప్రోత్సహించిన యావత్‌ ఇస్లాం వ్యతిరేక ప్రచారంలో ఇది ఒక విడదీయరాని భాగమన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైనికులు ఖురాన్‌ను తగులబెట్టడం వంటి అనేక ఉద్ధేశపూర్వక, అవమానించే చర్యల్లో భాగమేనన్నారు. ఈ నేపథ్యం లేకపోయి వుంటే ఇలాంటి సినిమాలను ఇంత సులభంగా తీసీ ఉండేవారు కాదు, అవంత సులభంగా విడుదలయ్యేవీ కావు.

అమెరికా ప్రభుత్వ బ్రహ్మాండమైన నిఘా వ్యవస్థను దృష్టిలో వుంచుకున్నప్పుడు ఈ సినిమాని తీయడం గురించి గానీ, దాని విడుదల గురించి గానీ దానికి తెలీదని నమ్మడం అమాయకత్వమైనా అవుతుంది లేదా మనల్ని మనం మోసగించుకోవడమైనా అవుతుందని, ఇంత పెద్దెత్తున నిరసనలు వ్యక్తమైన తర్వాత కూడా అమెరికా ప్రభుత్వం ఈ సినిమాని తీసినవాళ్లని అరెస్టు చేయడానికి గానీ, దాని విడుదలను నిలుపుదల చేయడానికి గానీ, ముస్లింలకు క్షమాపణ చెప్పడానికి గానీ సిద్ధంగా లేదన్నారు. మనోభావాలు గౌరవిస్తామంటూ నామమాత్రమైన, అస్పష్టమైన ఖండనలూ, ప్రకటనలూ యిస్తూ ప్రజల్ని మోసగించజూస్తోందన్నారు. అంతే కాకుండా, తన పౌరుల్ని నిరసనకారుల నుంచి కాపాడుకునే సాకుతో అది లిబియా లాంటి దేశాల్లోకి నేరుగా తన సైనికుల్ని పంపిస్తూ వాటి సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని ఆరోపించారు.

ముస్లిం ప్రజానీకానికి అమెరికా సామ్రాజ్యవాదపు దుర్మార్గాలతో తగినంత అనుభవం ఉందని, వారు దాని మోసాన్ని గ్రహించారని, అందుకే అమెరికాకీ, దాని పశ్చిమ మిత్రదేశాలకూ వ్యతిరేకంగా నానాటికీ శాంతియుతమైన, హింసాత్మకమైన నిరసనలు మరింతగా ఎగస్తున్నాయని తెలిపారు. సామ్రాజ్యవాద యుగపు నీరోలైన పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు ముస్లింల పట్ల ఎంత బాధ్యతారహితమైన, దుర్మార్గమైన వైఖరిని కలిగి వుంటారనే విషయాన్ని ఒక పక్క ప్రపంచం అంతా ఈ సినిమాకు వ్యతిరేకంగా మండిపోతుంటే ఫ్రాన్స్‌లోని ఒక పత్రిక మహమ్మద్‌ ప్రవక్తను అవమానిస్తూ 20 కార్టూన్‌లను ప్రచురించడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్రాన్స్‌ ముందస్తు హెచ్చరికగా 20 దేశాల్లో తన దౌత్య కార్యాలయాల్ని మూసివేసింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ లెబనాన్‌పై చేసిన దురాక్రమణ దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన, సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలు గల హసన్‌ నస్రల్లా వంటి మరింత విస్తృతమైన నిరసనలు తెలపల్సిందిగా పిలుపునివ్వడంతో మరొక విడతగా నిరసనలు వెల్లువెత్తాయి.

మత సామరస్య భావాలు గల ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రజాస్వామికవాది ఈ నిరసనల్లో పాల్గొని ప్రత్యేకంగా ఇస్లాం మతస్తులను టార్గెట్‌ చేస్నున్న అమెరికా, యూరోప్‌ సామ్రాజ్యవాదుల సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. మతపరమైన మనోభావనలను గాయపర్చడం అనేది సాంస్కృతిక సామ్రాజ్యవాదంలో ఒక భాగం మాత్రమే. ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదపు రాకాసికున్న ఇతర అనేక కోరలు ఆసియా, ఆఫ్రికా లాటిన్‌ అమెరికా దేశౄల స్థానిక సంస్కృతి (భాషలు, యాసలు, ఆహారపు అలవాట్లు, కట్టు, కట్టడాలు – ఒకటనేంటి, అన్నిటినీ) ఎలా గొంతు నులిమివేస్తున్నాయో ఈ నిరసనల సందర్భంగా బహిర్గతం చేయాలని కోరారు. అమెరికా ప్రభుత్వమూ, ఈ సినిమా తీసినవారూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయడంతో పాటు ఈ నిరసనలు విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలుగా, ప్రత్యేకించి వెనుకబడిన దేశాల్లో తన భౌగోళిక-రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికీ, ఆ దేశాల్లోని చమురు, ఇతర సహజ సంపదలనూ దోచుకోవడానికీ అక్కడి ముస్లింలను టార్గెట్‌ చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలుగా మారాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.