ప్రపంచ పేదరికంలో భారత్‌లోనే 26 శాతం
– పేదరిక నిర్మూలనకు కలిసి పనిచేస్తాం
– మోదీతో ప్రపంచబ్యాంకు చైర్మెన్
న్యూఢిల్లీ,జూన్ 30(జనంసాక్షి): భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్.. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పోషకాహారం, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. భారత్‌లో ఈ అంశాలపై జరగుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు కిమ్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుపేదల్లో 26 శాతం మంది ఇక్కడ ఉన్నారన్నారు. పేదరికాన్ని తగ్గించేందుకు భారత్ ముందు చాలా అవకాశాలున్నాయని కిమ్ అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని కిమ్ అన్నారు. భారత్ చేపట్టే అభివృద్ధి పనులకు ప్రపంచబ్యాంకు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కిమ్ చెప్పారు. మోదీ సర్కారుపై ప్రశంసల జల్లు కురింపించారు. కఠిన లక్ష్యాలను చేరుకునేందుకు మోదీ తన మంత్రి వర్గ సహచరులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. బ్రెగ్జిట్ నుంచి భారత్ వెంటనే బయటపడిందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ రూపు దిద్దుకుంటోందని చెప్పారు.సౌరశక్తి ప్రాజెక్టులకు బిలియన్ డాలర్ల సాయం చేయాలని ప్రధాని కోరినట్లు తెలిసింది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో కూడా భేటీ అయ్యారు. భారత్ లో రెండు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన ప్రధానిని, ఆర్థికమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను ఫండింగ్ చేయనున్నట్టు వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. పోషణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో భారత ప్రభుత్వ పథకాలకు మద్దతు అందించే చర్యల్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ప్రధానిని కలిసినట్టు పీఎంవో వర్గాలు ట్విట్ చేశాయి. ప్రధాని కార్యాలయం ప్రధానమంత్రితో భేటీ అయిన కిమ్ ఫోటోను ట్వీట్ చేశాయి. భారీ సౌర ఇంధన కార్యక్రమానికి 30 సోలార్ ప్రాజెక్టులకు ఒక బిలియన్ డాలర్ల (6వేల 750 కోట్లను) నిధులను ఇవ్వనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్‌ఎ)తో దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కదుర్చుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలొ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐఎస్‌ఎ ఆర్థిక భాగస్వామిగా బహుపాక్షిక రుణ ఏజెన్సీ స్థాపిస్తుంది. క్లైమేట్ ఫ్రెండ్లీ భవిష్యత్తులో గ్లోబల్ ఉద్యమానికి ఇది దోహం చేస్తుందనే కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇండియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం న్యూ ఢిల్లీలోని స్కిల్ ఇండియా సెంటర్‌ను సందర్శించారు. అనంతరం ఆ తర్వాత అంగన్ వాడి సెంటర్ కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించినసంగతి తెలిసిందే.