ప్రపంచ బ్యాంక్‌ ఏజెంట్లుగా పాలకులు

5

– విద్యుత్‌ అమరవీరులకు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి):

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ బ్యాంక్‌ రుణాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతున్నాయని  సిపిఎం పాలిట్‌ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు మండిపడ్డారు. గతంలో ఇలాగే ఎపి నష్టపోయిందన్నారు.  గతంలో కూడా ప్రపంచ బ్యాంక్‌ రుణం కోసం వారు పెట్టిన అనేక షరతులను ఆమోదించి ప్రభుత్వం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసిందని ఆయన అన్నారు. పద్నాలుగేళ్ల క్రితం బషీర్‌ బాగ్‌ వద్ద విద్యుత్‌ చార్జీల ఆందోళనలో జరిగిన కాల్పులలో మరణించిన నలుగురు అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వివిధ పధకాల కోసం పాతిక వేల కోట్ల అప్పును ప్రపంచ బ్యాంకును అడుగుతున్నారని, అలాగే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. మళ్లీ ప్రపంచ బ్యాంక్‌ పెత్తనం రెండు తెలుగు రాష్ట్రాలపై రాబోతున్నదని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఉత్తం కుమార్‌ రెడ్డి,రఘువీరారెడ్డి, సిపిఐ నేత నారాయణ తదితరులు కూడా నివాళి అర్పించారు.  2000 సంవత్సరంలో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన బషీర్‌బాగ్‌ అమరవీరులకు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నేతలు,కార్యకర్తలు నివాళులర్పించారు. బషీర్‌బాగ్‌ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.  తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, 2000 సంవత్సరంలో సమైక్య పాలనలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం విద్యుత్‌ టారిఫ్‌లు పెంచడంతో రైతులు తమకు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు మోసే ఆర్థిక స్థోమత లేదని నిరసన వ్యక్తం చేస్తూ బషీర్‌బాగ్‌లో ధర్నాకు దిగారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపించింది. ఇదే ఆనాటి ప్రభుత్వ పతనానికి కారణమయ్యిందని జానారెడ్డి,నారాయణ తదితరులు అన్నారు. ఉచిత విద్యుత్‌ అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ దీనిని ప్రేరణగా తీసుకుందని జానా అన్నారు.  అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిన పాలకుల మెడలు వంచిన సందర్భమదన్నారు. దేశ,రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు, ప్రజా ఉద్యమాలు ఎగసేలా స్ఫూర్తి నింపిందన్నారు. అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిన నాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజాలు పడ్డ మ¬జ్వల నిరసనగా సిపిఐ నేత నారాయణ అన్నారు.  అక్కడ పేలిన తూటాలు, విరిగిన లాఠీలు, నెత్తురోడిన రోడ్లు, క్షతగాత్రులతో నిండిన ఆసుపత్రులు నాడు తొమ్మిదేళ్ల బాబు సర్కారును దింపడమే కాదు ఇప్పటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

బషీర్‌బాగ్‌ కాల్పులకు ఆగస్టు 28తో 15 ఏళ్లు.పోలీసుల కాల్పులతో బషీర్‌బాగ్‌ నెత్తురోడింది. బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ పోలీసు తూటాలకు తీవ్రంగా గాయపడి…ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కాల్పుల ఘటనపై రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉద్యమాలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు సర్కారుపై నిరసనలు ¬రెత్తాయి.